హోంమంత్రి వనితను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ‘నెల్లూరు కోర్టు చోరీ కేసు విచారణలో వాస్తవాలు బయటికి.. ’

Published : Apr 19, 2022, 07:06 PM IST
హోంమంత్రి వనితను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ‘నెల్లూరు కోర్టు చోరీ కేసు విచారణలో  వాస్తవాలు బయటికి.. ’

సారాంశం

రాష్ట్ర నూతన హోం మంత్రి తానేటి వనితను రాష్ట్ర డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు మంత్రిని సచివాలయం రెండో బ్లాకులో కలిశారు. పోలీసు శాఖలోని పలు కీలక అంశాలపై మంత్రితో వారు చర్చించారు. అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. 

అమరావతి: ఇటీవలే రాష్ట్ర నూతన హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనితను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కే రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయం రెండవ బ్లాకులో హోం మంత్రిని డీజీపీతోపాటు అదనపు డీజీపీ రవిశకంర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్ర బాబు, శాంతి భద్రతల డీఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఐజీ ట్రైనింగ్ వెంకటరామిరెడ్డి, గుంటూరు ఎస్పీ అరిఫ్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొత్త మంత్రిగా శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు శాఖలోని వివిధ అంశాలపై హోం మంత్రి వనితకు డీజీపీ వివరించారు. పోలీసు శాఖకు సంబంధించిన పలు అంశాలపై హోం మంత్రి వారితో చర్చించారు.

అనంతరం డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హోం మంత్రి తానేటి వనితన మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళలపై దాడుల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, ఐటీ రెయిడ్స్, వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసుల సత్వర పరిష్కారం వంటి విషయాలపై మంత్రితో చర్చించామని వివరించారు.

రాష్ట్రంలో దిశ యాప్‌కు విశేష ఆదరణ ఉన్నదని, ఇప్పటి వరకు సుమారు కోటి 24 లక్షల మంది ఈ యాప్  డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. కానీ, కేవలం డౌన్‌లోడ్ చేసుకున్నంత మాత్రానా ప్రయోజనం ఒనగూరదని, అందులో నమోదు చేసుకోవాలని కోరారు. అందులో తమ డేటా నమోదు చేస్తే దుర్వినియోగం  అవుతుందనే అపనమ్మకాలు వదిలిపెట్టాలని అన్నారు. డేటా దుర్వినియోగం కాకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామని వివరించారు.

కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశామని, కేవలం పాడేరు, మన్యం జిల్లాల్లో ఇంకా  పూర్తి కాలేదని, మరో 15 రోజుల్లో పూర్తవుతుందని వివరించారు. ఎస్పీ, డీఎస్పీలతోపాటు ఇతర సిబ్బందిని కూడా నియమించామని, కార్యాలయాలు కూడా ఏర్పాటై పూర్తిస్థాయిలో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నదని తెలిపారు. పాడేరు, మన్యం జిల్లాలో కొంత జాప్యం జరిగిందని, 15 రోజుల్లో అక్కడ పూర్తిస్థాయిలో పోలీసు వ్యవస్థ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కలకలం రేపిన నెల్లూరు కోర్టు చోరీ కేసు వివరాలపైనా ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ స్పందించారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసులో సాక్ష్యాల ఆధారంగా ముందుకు వెళ్లామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఎష్పీ క్లియర్ చేశారని వివరించారు. చోరీ చేసినవారు పలు కేసుల్లో నిందితులని, విచారణలో వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని అన్నారు. స్థానికంగా ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్