
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులపై ఏపీ డీజీపీ (ap dgp) గౌతం సవాంగ్ (gautam sawang) స్పందించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరూ సంయమనం పాటించాలని డీజీపీ హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని గౌతం సవాంగ్ సూచించారు.
కాగా, సీఎం జగన్‌ను టీడీపీ నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలు, నేతల నివాసాలపై మంగళవారం దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.
కార్యాలయంలో కనిపించిన వారిపై దాడికి దిగిన వైసీపీ నేతలు.. అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే విశాఖ, తిరుపతి, గుంటూరులలోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు (chandrababu naidu) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో (biswa bhusan harichandan) ఫోన్‌లో మాట్లాడి ఆయనకు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాలతో టీడీపీ కార్యాలయాలకు రక్షణ కల్పించాని కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ (union home ministry) సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
అంతకుముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపైనా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లో మంగళవారం గుర్తు తెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. దీంతో పట్టాభి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి సమయంలో పట్టాభి.. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులోనే వున్నారు.
కాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు (nakka ananda babu) పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా (ganja cultivation in andhra pradesh) మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ (telangana police), తమిళనాడు (tamilnadu police) పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.