గిరిజన ఉత్పత్తులకు మద్ధతు ధర కల్పించండి: కేంద్రానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విజ్ఞప్తి

Siva Kodati |  
Published : May 12, 2020, 03:49 PM IST
గిరిజన ఉత్పత్తులకు మద్ధతు ధర కల్పించండి: కేంద్రానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విజ్ఞప్తి

సారాంశం

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు అదనపు నిధులను ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు అదనపు నిధులను ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వన్ ధన్ కేంద్రాలు తదితర అంశాలపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ ముండా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. అటవీ ఉత్పత్తుల్లో మరికొన్నింటిని కూడా ఎం.ఎస్.పి. జాబితాలోకి చేర్చాలని, రాష్ట్రానికి అదనంగా వన్ ధన్ కేంద్రాలను మంజూరు చేయాలని ఆమె కోరారు.

 

 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని శ్రీవాణి చెప్పారు. సిఎం రూపకల్పన చేసిన వైయస్సార్ టెలి మెడిసిన్ పథకం ద్వారా గిరిశిఖర గ్రామాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు తక్షణ వైద్య సదుపాయం అందిస్తున్నామన్నారు.

గిరిజనుల వైద్యం కోసం వైయస్సార్ టెలిమెడిసిన్ పథకాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ (మోటా) రాష్ట్రంలో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గత ఏడాది రూ.8.28 కోట్లను మంజూరు చేయగా దీనిలో రూ.5.28 కోట్లను గిరిజన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ)కి ఇచ్చామని ఆమె చెప్పారు.

రూ.3 కోట్లను గిరిజన రైతు స్వయం సహాయ సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ గా కేటాయించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రైఫెడ్ ద్వారా రూ.19.05 కోట్లను మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ప్రతిపాదనలు పంపామని ఆమె వెల్లడించారు.

 

 

రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో 21280 మంది గిరిజనులతో 75 వన్ ధన్ కేంద్రాలను నిర్వహించడం జరుగుతోందని, అలాగే మరో మూడు జిల్లాల పరిధిలోని 4,500 మంది గిరిజనులతో 15 కొత్త వన్ ధన్ కేంద్రాలను మంజూరు చేయాలని పుష్పశ్రీవాణి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సంతలను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఐటీడీఏల పిఓలు తయారుచేస్తున్నారని తెలిపారు.

లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కనీస మద్దతు ధరలు ఇవ్వడానికి అమలు చేస్తున్న అటవీ ఉత్పత్తుల జాబితాలో గిరిజన రైతులు పండించే పసుపు, పైనాపిల్, రాజ్ మా లను కూడా చేర్చి, వాటికి సరౌన ధరలను ఇవ్వాలని పుష్ప శ్రీవాణి కేంద్ర మంత్రిని కోరారు.

రాష్ట్రంలో జీసీసీ ఆధ్వర్యంలో వనమూలికలతో సబ్బులు తయారు చేసే రెండు పరిశ్రమలు ఉండగా వీటి ద్వారా రోజుకు 20 వేల సబ్బులను ఉత్పత్తి చేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.  

రూ.15 గరిష్ట ధర కలిగిన ఈ సబ్బులను జీసీసీ నుంచి కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని ఆమె కేంద్రమంత్రిని అభ్యర్ధించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రవిచంద్ర, డైరెక్టర్ రంజిత్ భాషా తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu