చిన్న గొడవలతో వైసీపీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం బాధేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. తప్పుగా మాట్లాడితే రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు:చిన్న చిన్న గొడవలతో YCPలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం బాధేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం Narayana Swamy చెప్పారు.నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు Dalithలపై పడుతున్నారని చెప్పారు.వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని ఆయన చెప్పారు. రెడ్లు లేకపోతే తాను గెలవలేనని చెప్పారు.
వర్గపోరుకు రెడ్లు స్వస్తి పలకాలని ఆయన కోరారు.Reddy సామాజికవర్గానికి చెందిన వారు రెండు గ్రూపులుగా అయ్యారంటే వారి ధ్యేయమంతా దళిత వాడలపైనే పడుతుందన్నారు.రెడ్లు పంతానికి పోతే ఎంతైనా చేస్తారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.ఎస్సీగా రిజర్వేషన్ లేకపోతే తనకు సీటు వచ్చేది కాదన్నారు.రెడ్లు యూనిటీగా లేకపోతే తాను గెలవలేనని చెప్పారు అన్ని వర్గాల సహకారం లేకపోతే మెజారిటీ వచ్చేది కాదన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎప్పుడూ ఏదో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఏపీ సీఎం జగన్ కేబినెట్ ను పునర్వవ్యవస్థీకరించిన తర్వాత నారాయణస్వామికి మరోసారి చోటు దక్కింది. గతంలో కూడా నారాయణస్వామికి డిప్యూటీ సీఎంను జగన్ ఇచ్చారు. రెండోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో జగన్ ఫోటోను పట్టుకొని నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు. జగన్ ను నారాయణస్వామి దేవుడితో పోల్చాడు.
దేవుళ్లలో ఉండే లక్షణాలు సీఎం జగన్ లో ఉన్నాయన్నారు. అందుకే తనకు రెండో సారి మంత్రిగా అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. అందుకే జగన్ ఫొటోతో ప్రవేశించానని ఆయన ప్రకటించారు. సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామని చెప్పారు. దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్.. అందుకే ఆయన ఫొటో పట్టుకునే చాంబర్‌లోకి ప్రవేశించానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మలతో ఉన్న ఉంగరాలను కూడా నారాయణస్వామి ధరించి అధినేత చూపు తనవైపు పడేలా చేసుకున్నారు.
గత టర్మ్ లో కూడా నారాయణస్వామి ఎక్సైజ్ శాఖను నిర్వహించాడు. ఈ దఫా కూడా నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖనే కేటాయించారు.
ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు గురి కావద్దని రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో చెప్పారు.
సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. . ఇది రెడ్ల రాజ్యం కాదని చెబుతూనే బడుగుల రాజ్యంగా అభివర్ణించారు. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చూసిన తరువాత తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
గతంలో కూడా నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.తనపై వస్తున్న ఒత్తడిని తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా ఇన్ని బాధలు లేవని వ్యాఖ్యానించారు.తనపై చాలా ఒత్తిడి ఉందన్నారు. ఎంత వినయంగా ఉన్నప్పటికీ.. గ్రూప్ రాజకీయాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. గ్రామం నుంచి కొందరిని తరిమేయాలని తనపై వస్తున్న ఒత్తిళ్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రస్తావించారు.
గ్రామం నుంచి కొందరిని తరిమేయడం ఎలా కుదురుతుందని సొంత పార్టీ నేతలను ప్రశ్నించారు. ఇలాంటి చట్టం ఎక్కడైనా ఉందా అని సొంత పార్టీ నేతలను ఆయన నిలదీశారు. మీరు వద్దంటే రాజకీయాల నుంచి తప్పుకొంటా.. మీ ఇష్టం చెప్పండి అంటూ వాపోయారు. తాను అందరిలాగా రాజకీయాలు చేయడం లేదని.. పద్దతులు అనుసరిస్తున్నానని పార్టీ నేతలకు తెలిపారు.