తెలంగాణతో నదీజలాల వివాదం నెలకొన్ననేపథ్యంలో దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కేంద్ర జలవనరుల కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.
గుంటూరు: కృష్ణా నది జలాల విషయంలో పొరుగురాష్ట్రం తెలంగాణ అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. అందువల్లే ఏపీ ప్రయోజనాలను కాపాడుకోడానికే సుప్రీం కోర్టు తలుపుతట్టాల్సి వచ్చిందని... ప్రత్యామ్నాయ మార్గం లేకే అలా చేశామని కేంద్ర జలవనరుల శాఖకు వివరించారు. ఇది కేంద్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ కు సీఎస్ లేఖ రాశారు.
తమ సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా జలాలను వాడుకుంటోందని సీఎస్ ఫిర్యాదు చేశారు. కృష్ణా నదిపై గల ఉమ్మడి జలాశయాల్లో నీటి వినియోగంపై ఉన్న విధివిధానాలను తెలంగాణ ఉళ్లంగిస్తోందని సీఎస్ జలవనరులశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.
read more కేసీఆర్‌కి జగన్ కౌంటర్: కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై సుప్రీంలో ఏపీ పిటిషన్
తెలంగాణ శ్రీశైలం జలాశయంలోని నీటి మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తోడేస్తోందని... దీనివల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి గ్రావిటి ద్వారా నీరు పొందేందుకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించలేకపోతున్నామని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇక బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ప్రాజెక్టులవారీ కేటాయింపులు జరిపే వరకు కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయొద్దంటూ తెలంగాణ అడ్డుపడుతోందన్నారు. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. బోర్డు పరిధిని త్వరగా నోటిఫై చేయాలని... ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని తీసుకునే ఆఫ్‌టేక్ పాయింట్లు దాని పరిధిలోకి తీసుకొచ్చి సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని సీఎస్ కోరారు.