
అమరావతి: స్టేట్ ఎలక్షన్ కమీషన్ సెక్రెటరీ నియామకం కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను చీఫ్ సెక్రెటరీ ఆదిత్యానాద్ దాస్ ఎస్ఈసికి పంపిచారు. జి. విజయ కుమార్, కె కన్నబాబు, పి రాజాబాబుల పేర్లను స్టేట్ ఎలక్షన్ కమీషన్ సెక్రెటరీ పదవికోసం సూచించారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఎస్ఈసి సెక్రటరీగా నియమించనున్నారు కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
ఇదిలావుంటే ప్రభుత్వం జారీచేసే కొన్ని పత్రాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ఉండడంపై ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఆ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ కు లేఖ రాశారు. కుల ధ్రువీకరణ పత్రాలపై, ఎన్ఓసీలపై వైఎస్ జగన్ ఫొటోలను తొలగించాలని ఆయన ఆ లేఖలో సూచించారు. ఈ విషయంపై జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
ఆ విషయంపై తహసిల్దార్లకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆదిత్యనాథ్ దాస్ కు సూచించారు నిమ్మగడ్డ. వాటిపై జగన్ ఫొటోలు ఉండడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల జారీలో వివక్ష లేకుండా చూడాలని కూడా ఆయన సూచించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నేడు, రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటించనున్నారు.