జగన్! ఆ పదాలు నీ డిక్షనరీలో డిలీట్ చేయ్, సొంతవారినే మోసం చేశావ్: తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jul 27, 2019, 1:57 PM IST
Highlights

ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత అనే పదాలు వాడొద్దని సూచించారు. అన్నదాతలు, రైతన్నల విషయంలో ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు. 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వానికి మాట తప్పడం, మడమ తిప్పడం దిన చర్యగా మారిందని ఆరోపించారు. 

ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత అనే పదాలు వాడొద్దని సూచించారు. అన్నదాతలు, రైతన్నల విషయంలో ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు. 

రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 12,500 ఇస్తామని జగన్ మేనిఫెస్టోలో పెట్టారని అది ఇప్పుడు రూ.6,500కు మాత్రమే రాష్ట్రప్రభుత్వం ఇస్తుందని మిగిలిన రూ.6000 కేంద్రం ఇస్తుందని జగన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. 

పీఎం కిసాన్ యోజన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకమని దానికి రాష్ట్రప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. సున్నా వడ్డీ వ్యవసాయ రుణాలు అంటూ నానా హంగామా చేసిన సీఎం జగన్ తీరా బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించి రైతులను మోసం చేశారని విమర్శించారు. 

సీఎం హోదాలో రూ. 3,500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.100 కోట్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులని ఆరోపిస్తూ విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసిన విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. జలదీక్షలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను హిట్లర్ తో పోల్చిన జగన్ ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.  

ఒకప్పుడు అది అక్రమ ప్రాజెక్టు అని ఆరోపించిన జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో పాల్గొనడం తన జన్మ ధన్యమైందని చెప్తున్నారంటూ దుయ్యబుట్టారు. ఎన్నికల ప్రచారంలో  20మంది ఎంపీలు ఇస్తే కేంద్రంను ఆడిస్తా అంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు నిటూర్పులు ఊదుతున్నారంటూ విరుచుకుపడ్డారు.  

ఎన్నికలకు ముందు అనేక మందికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి హ్యాండ్ ఇచ్చారంటూ మండిపడ్డారు. వైయస్ జగన్ పాలన అంతా మాటలే తప్ప చేతల్లో ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. 

మద్యపాన నిషేధం మూడు దశల్లో చేస్తానన్న జగన్ ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందని అనడంలో అర్థం ఏంటో చెప్పాలని నిలదీశారు. మాజీ సీఎం చంద్రబాబు కన్నా ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించడమే మద్య నిషేధమా..? అంటూ నిలదీశారు. 

45 ఏళ్లకే పెన్షన్ అని జగన్ తాటికాయంత అక్షరాలతో తన పేపర్లోనే రాయించుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలోని అన్ని‌వర్గాల పేదలందరికీ 45 ఏళ్లకే పెన్షన్ అని ధర్మవరంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నాడంటూ విమర్శించారు. 

ఇన్నిసార్లు మాట తప్పిన జగన్‌ను వంద మాదిగలు మాత్రం గొప్పగా పొగిడేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 55 రోజుల జగన్ పాలనలో మాటలు తప్ప చేతల్లో చేసిందేమీ లేదంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి జగన్ పై దుమ్మెత్తిపోశారు. 

click me!