పార్టీకి పాతరేనా ?

Published : Dec 31, 2016, 03:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
పార్టీకి పాతరేనా ?

సారాంశం

వైసీపీ, కాంగ్రెస్ ముఖ్యులతో బాగా సన్నిహిత సంబంధాలున్న ఓ కీలక నేతే రెండు వైపులా సయోధ్య చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

కాంగ్రెస్ పార్టీకి పాతర వేయాలని స్వయంగా పార్టీ కీలక నేతలే కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. బాగా ఉచ్ఛ స్ధితిలో ఉన్న సమయంలో ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర విభజన చేయటంతో పార్టీ ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోయింది.

 

విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ విషయం స్పష్టమైంది. దాంతో చాలా కాలం ప్రజల్లో కాంగ్రెస్ మొహం చూపలేకపోయింది.

 

అయితే,  విభజన చట్టంలోని ప్రయోజనాలను రాష్ట్రానికి కల్పించటానికి  ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇష్టపడలేదు. ఏ విధంగా పుంజుకోవాలో అర్ధం కాక అయోమయంలో పడిన కాంగ్రెస్ కు మోడి చర్య కలిసి వచ్చింది. దాంతో రాజ్యసభ సభ్యుడు కెవిపి రూపంలో ప్రత్యేకహోదా పేరుతో పోరాటాన్ని మొదలుపెట్టింది. ఆ విషయంలో పార్టీకి కొంచెం ప్రజల్లో సానుకూలతే కనిపించింది.

 

పార్టీ నేతలందరూ ఐకమత్యంగా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయటానికి బోలెడన్ని అవకాశాలున్నాయి. ప్రజల్లో కూడా అటు ఎన్డిఏ, ఇటు టిడిపి పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది. పాలనలో యూపిఏ అయినా ఎన్డిఏ అయినా ఒక్కటే అనే అభప్రాయం ప్రజల్లో కనబడుతోంది.

 

ఇటువంటి పరిస్ధితిల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు మొదలుపెడితే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కాంగ్రెస్ వైపు ప్రజలు కొద్దిగా మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అయితే, అంత తొందరగా ప్రజల మద్దతు పొందటం ఎందుకనుకున్నారో ఏమో కొందరు నేతలు.  

 

 

అందుకని, కీలక నేతలను ఇతర పార్టీల్లో చేరటానికి ప్రోత్సహిస్తున్నారు.  పార్టీని వీడుతున్న నేతలందరూ తమతో పాటు తమ క్యాడర్ను కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే టిడిపిలో చేరిన దేవినేని నెహ్రూనే అందుకు ఉదాహరణ. నెహ్రూను టిడిపిలోకి చేర్చుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం బహిరంగమే.

 

ఆ విషయం తెలిసీ నెహ్రూ కుమారుడు అవినాష్ కు రాష్ట్ర యువజన అధ్యక్షుని బాధ్యతలు అప్పచెప్పారు. అంతే కాకుండా పలువురు అనుచరులకు జిల్లా, పార్లమెంట నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇపుడు వారంతా నెహ్రూతో పాటు టిడిపిలోకి వెళ్లిపోయారు. 

 

ఇటువంటి పరిస్ధితుల్లోనే తాజాగా వినిపిస్తున్న మాటేమిటంటే ఇంకొందరు నేతలు త్వరలో వైసీపీలో చేరనున్నారని. సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేరు కూడా వినిపిస్తుండటం ఆశ్చర్యమే. ఆయనతో పాటు మాజీ మంత్రి శైలజానాధ్, మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

                                                                                                                                                                     

 

 

వైసీపీ, కాంగ్రెస్ ముఖ్యులతో బాగా సన్నిహిత సంబంధాలున్న ఓ కీలక నేతే రెండు వైపులా సయోధ్య చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అంటే దశాబ్దం పాటు అన్నీ  అధికారాలు అనుభవించిన నేతలే కష్టకాలంలో పార్టీకి పాతర వేద్దామని నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?