పోలవరం ముంపు... రూపాయి ఎక్కువైనా సరే సాయం: అధికారులకు జగన్ ఆదేశాలు

By Siva Kodati  |  First Published Feb 28, 2020, 4:50 PM IST

ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదని, ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదని, ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పునరావాలస కాలనీల్లో పనులకు అవసరమైన డబ్బు విడుదల చేస్తామని జగన్ అధికారులకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం స్పిల్‌వే పనులు జూన్‌ కల్లా పూర్తికావాలి, అదేవేగంతో అప్రోచ్‌ ఛానల్‌కూడా పూర్తికావాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

Latest Videos

undefined

Also Read:పోలవరం పనులపై జగన్ ఆరా: ఏరియల్ సర్వే

శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థలు, ప్రజా ప్రతినిధులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందని, జూన్‌ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌ను 2021 సీజన్‌కు అందుబాటులోకి తీసుకువస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని, దీనివల్ల నీటిని అందించడానికి వీలుంటుందని జగన్ అభిప్రాయపడ్డారు.

గతంలో ప్రణాళిక లోపం, సమన్వయ లోపం, సమాచార లోపం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత సీజన్‌ను కోల్పోయాం, ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదన్నారు.

జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా పనులు జరగాలని, ఈ పనులు జరగడానికి ఉన్న అడ్డంకులపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. స్పిల్‌వేను జూన్‌నాటికి అందుబాటులోకి తీసుకువస్తే, నదిలో నీటిని స్పిల్ వే మీదుగా తరలించే అవకాశం ఉందని జగన్ చెప్పారు.

అదే సమయంలో జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం పనులు జరగాలంటే .... కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను కూడా భర్తీచేయాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు కాపర్‌ డ్యాం పూర్తిచేసేసరికి ముంపు పెరుగుతుందని, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. సహాయ పునరావాస పనులపై ఇప్పటినుంచే దృష్టిపెట్టి ఆ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.

Also Read:2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: తేల్చేసిన కేంద్రం

సత్వరంగా అనుమతులు తెప్పించుకోవడం కోసం ఢిల్లీలో ఒక అధికారిని ఉంచాలని, డ్రాయింగులు, డిజైన్ల అనుమతికోసం, లైజనింగ్‌ కోసం ఒక అధికారిని పూర్తిగా కేటాయించాలని సీఎం కోరారు. గతంలో అప్రోచ్‌ ఛానల్‌ కూడా చేయకపోవడం వల్ల స్పిల్‌వే ఛానల్‌లో మొన్నటి వరద కారణంగా సిల్ట్ వచ్చి పేరుకుపోయిందన్నారు.

కుడి, ఎడమ కాల్వలను అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. రెండువైపులా టన్నెల్‌ తవ్వకం పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.

కాపర్‌డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తి చేస్తే గోదావరిలో 41.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని అధికారులు తెలిపారు. దీనివల్ల వెంటనే 17వేలకుపైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

click me!