వలసకూలీల తరలింపు... కేంద్ర మంత్రి, ఒడిషా సీఎంలతో జగన్ చర్చలు

By Arun Kumar P  |  First Published May 2, 2020, 1:23 PM IST

వలసకూలీల తరలింపుపై చర్చించేందుకు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఏపి సీఎం జగన్ చర్చలు జరిపారు. 


అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని వారి స్వస్థలాలకు చేరుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే వారి తరలింపుకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. ఈ క్రమంలో వలసకూలీల తరలింపుపై చర్చించేందుకు ఏపి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చ  జరిగింది. 

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఉపాధినిమిత్తం ఒడిషాకు వలసవెళ్లి చిక్కుకున్న కూలీలు, కార్మికుల తరలింపుపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ఇలా తమ రాష్ట్రంలో చిక్కుకున్న వారిని తరలించడానికి ఏపి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తామని నవీన్ పట్నాయక్  హామీ  ఇచ్చారు. కేంద్రం కూడా ఇందుకు సహకరిస్తుందని ధర్మేంద్ర  ప్రధాన్ తెలిపినట్లు సమాచారం. 

Latest Videos

undefined

అలాగే ఏపిలో ఉన్న ఒడిషా కూలీలు, కార్మికులను తరలించే విషయమై కూడా చర్చలు కొనసాగాయి. ఏపీలో చిక్కుకుపోయిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు అందించి ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు ఒడిషా సీఎం ధన్యవాదాలు తెలిపారు. 

లాక్ డౌన్ మరోసారి పొడిగించడమే కాకుండా వలస కూలీల తరలింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. వారందరితో ఏకాభిప్రాయాంకు వచ్చిన తర్వాతే లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించామన్నారు. రెడ్‌జోన్ల ప్రాంతాల్లో ఇకపై లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. 

 వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు అందించామని వెల్లడించారు. కూలీల తరలింపు కోసం 300 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2 కోట్ల 22 లక్షల పీపీఈ కిట్లు తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. 

click me!