వైసీపీకి చెందిన మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో సీఎం జగన్ ఇవాళ భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో విజయం కోసం నేతలకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
అమరావతి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో సీఎం వైఎస్ జగన్ బుధవారంనాడు భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు.
2019 ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధి జోగేశ్వరరావు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం కోసం వైసీపీ ఇప్పటినుండే ప్లాన్ చేస్తుంది. గతంలో టీడీపీలో ఉన్న తోట త్రీమూర్తులు వైసీపీలో చేరారు. తోట త్రిమూర్తులుకు వైసీపీ నాయకత్వం ఎమ్మెల్సీని చేసింది. మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తోట త్రిమూర్తులును ఇంచార్జీగా వైసీపీ ప్రకటించింది. టీడీపీలో ఉన్న సమయంలో జోగేశ్వరరావు,తోట త్రిమూర్తులు మధ్య మంచి సంబంధాలుండేవి. త్రిమూర్తులు పార్టీ మారి మండపేటకు వైసీపీ ఇంచార్జీగా రావడంతో ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
వచ్చే ఎన్నికల్లో మండపేటలో టీడీపీని ఓడించి వైసీపీ అభ్యర్ధి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులతో జగన్ చర్చించనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో 18 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలని జగన్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కుప్పం,అద్దంకి, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలతో సమావేశాలను ఇప్పటికే ముగించారు సీఎం జగన్, ఇవాళ మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో జగన్ సమావేశం కానున్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం ఫోకస్ పెట్టారు.
also read:దొప్పెర్లలో ఎమ్మెల్యే కన్నబాబురాజుకి చేదు అనుభవం: గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు గాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నతీరుపై సీఎం రివ్యూ చేస్తున్నారు. తనకు వచ్చిన నివేదిక ఆధారంగా సీఎం జగన్ వారికి సలహాలు,సూచనలు ఇస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్నిసీరియస్ గా తీసుకోని ప్రజా ప్రతినిధులపై జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.పద్దతిని మార్చుకోని ప్రజా ప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని కూ డా జగన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.