డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఖరారు

By telugu teamFirst Published Sep 21, 2020, 4:31 PM IST
Highlights

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అన్యమతస్థులు డిక్లరేషన్ మీద సంతకం చేయాలనే డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఆయన శ్రీవారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే విషయంపై ప్రతిపక్షాలు ఆందోళన తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఖరారైంది.  ఈ నెల 23వ తేదీన సాయంత్రం జగన్ 3.50 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 

ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఆయన సాయంత్రం 5 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6.20 గంటలకకు శ్రీవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మర్నాడు 24వ తేదీన ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.  

వైఎస్ జగన్ క్రైస్తవుడు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారిపై నమ్మకం ఉంటే చాలు, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతో వివాదం ప్రారంభమైంది. జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు. 

జగన్ శ్రీవారి దర్శనంపై బిజెపి, టీడీపీ విమర్శలు చేస్తున్నాయి. జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందేనని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు అన్నారు. ఈ నెల 23వ తేదీన జగన్ పర్యటన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ చోటు చేసుకుంది. 

కాగా, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వరూపానందేంద్రతో సమావేశమయ్యారు. వివాదం నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

click me!