పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదు.. దురుద్దేశంతోనే ఇలా: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 21, 2022, 4:48 PM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని ఖండించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.  వ్యక్తుల పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదని ఆయన గుర్తుచేశారు. రాజకీయ దురుద్దేశాలతోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వీర్రాజు ఆరోపించారు. 
 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు పలు పార్టీలు ప్రభుత్వ తీరుపై అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఖండించారు. రాజకీయ దురుద్దేశాలతోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌ను అభిమానించే వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా వున్నారని సోము వీర్రాజు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలతో ఏం సాధిస్తారంటూ జగన్‌ను ఆయన ప్రశ్నించారు. వ్యక్తుల పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదని సోము వీర్రాజు చురకలు వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని ఆయన గుర్తుచేశారు. 

కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు.  వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు. 

ALso REad:కూతురిని గిఫ్ట్ ఇస్తే వెన్నుపోటుతో ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై జగన్ సెటైర్లు

అనంతరం ఈ విషయమై సీఎం జగన్ కూడా ప్రసంగించారు. ఎన్టీఆర్ ను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. వైద్య రంగంలో సేవలు చేసినందుకే వైఎస్ఆర్ పేరును మెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. 

ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్టీఆర్ కు  వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఆ టర్మ్  కూడా పూర్తి కాలం పాటు పదవిలో ఉండేవారేమోనని జగన్ అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు నాయుడు ఏనాటికి కూడా సీఎం కాకపోయి ఉండేవారేమోననే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 


 

రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అభిమానించే వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఉన్నారు, ఇలాంటి నిరంకుశమైన నిర్ణయాలతో ఏమి సాధిద్దామని ఈ నిర్ణయం తీసుకున్నారు గారు? వ్యక్తుల పేరును మార్చగలరు కానీ చరిత్రను కాదు! pic.twitter.com/71DeyPaoB5

— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju)
click me!