ఫలానా కులం, మతం వారొద్దంటే రాజధానెలా అవుతోంది?:అమరావతిపై జగన్ సంచలనం

By narsimha lodeFirst Published Dec 25, 2020, 3:17 PM IST
Highlights

అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటేనే రాజధాని అవుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కులం వారు ఉండకూడదంటే రాజధాని ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. 

కాకినాడ:అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటేనే రాజధాని అవుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కులం వారు ఉండకూడదంటే రాజధాని ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. 

శుక్రవారంనాడు రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని  కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్ ప్రారంభించారు. 

వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు.  రాష్ట్రంలోని 75,755 మంది పేదలకు ఈ పథకం ద్వారా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది.

మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ,ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.  కొమరగిరిలో 367.58 ఎకరాల్లో 16,500 మందికి ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది.ఇళ్ల నిర్మాణానికి రూ. 50,940 కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. లాటరీ ద్వారా పేదలకు ఇళ్లను కేటాయించనున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాలవారు ఉంటేనే అది రాజధాని అవుతోందని ఆయన స్పష్టం చేశారు. ఫలానా కులం వారు, మతం వారు ఇక్కడ ఉండొద్దంటే అది రాజధాని ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. అందరికీ చోటిస్తేనే సమాజం అవుతోందన్నారు. అందరికీ మంచి చేస్తేనే ప్రభుత్వం అనిపించుకొంటుందని ఆయన చెప్పారు. 

అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామంటే  కులపరమైన అసమతుల్యం వాటిల్లుతోందని కోర్టులో  కేసు వేస్తే స్టేలు వచ్చాయన్నారు. చంద్రబాబు ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ రకమైన సమాజాన్ని రాజధానిని మనం నిర్మించుకొందామని ఆయన చెప్పారు.

30 లక్షల మంది మహిళల్లో చిరునవ్వును చూస్తున్నానని ఆయన చెప్పారు.  పాదయాత్రలో అద్దెలు కట్టుకోలేక పేదలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఆయన చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ  పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు, ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.

ఎన్నికలకు రెండేళ్ల ముందు చంద్రబాబు సర్కార్ కొన్ని ఇళ్లు నిర్మించారన్నారు. కానీ తమ సర్కార్ ఇళ్లు కాదు ఏకంగా ఊళ్లను నిర్మిస్తోందని ఆయన చెప్పారు.

కుల, మతాలకు సంబంధం లేకుండా అందరికీ ఇళ్ల పట్టాలను అందిస్తామన్నారు సీఎం.ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారులకు మూడు రకాల ఆఫ్షన్లను  ప్రభుత్వం ఇస్తోందని ఆయన చెప్పారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో పారదర్శకంగా చేపట్టినట్టుగా చెప్పారు.  అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు దక్కకపోతే ధరఖాస్తు చేసుకొన్న 90 రోజుల్లో ఇళ్ల పట్టాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కొందరి కుట్రల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యమౌతూ వచ్చిందని ఆయన విమర్శించారు.  ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డు పడ్డారన్నారు.  అనేక కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తెచ్చారన్నారు.  ఈ కారణంగానే ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు.న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత ఇళ్లు, ఇళ్ల పట్టాలపై పేదలకు సర్వహక్కులు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు ఇచ్చే జగన్ అన్న పథకం కావాలా..రూ. 2.65 లక్షల బ్యాంకు రుణం ఇచ్చే చంద్రబాబు స్కీం కావాలో లబ్దిదారులను అడిగితే  ఒక్కరే చంద్రబాబు స్కీం ను అడిగారన్నారు.

click me!