కూతురిని గిఫ్ట్ ఇస్తే వెన్నుపోటుతో ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై జగన్ సెటైర్లు

By narsimha lodeFirst Published Sep 21, 2022, 12:53 PM IST
Highlights

ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడవకపోతే  పూర్తి కాలం పాటు సీఎం పదవిలో కొనసాగి ఉండేవారేమోనని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

అమరావతి: ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు.బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో  హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్టీఆర్ కు  వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఆ టర్మ్  కూడా పూర్తి కాలం పాటు పదవిలో ఉండేవారేమోనన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబునాయుడు ఏనాటికి కూడా సీఎం కాకపోయి ఉండేవారేమోననే అభిప్రాయాన్ని సీఎం గుర్తు చేశారు.  ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు కంటే ఎన్టీఆర్ ను తాను ఎక్కువగా గౌరవిస్తానని  సీఎం జగన్ స్పష్టం చేశారు.ఎన్టీఆర్ పేరును మనం పలికితే చంద్రబాబుకు నచ్చదన్నారు. కానీ చంద్రబాబు ఈ పేరును పలికితే పైన ఉన్న ఎన్టీఆర్ కు నచ్చదని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఎవరూ అడగకపోయినా కూడా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరును ఎక్కడ పెట్టాలో చెబితే  తాము ఎన్టీఆర్ పేరు  పెడతామన్నారు.ఈ విషయమై టీడీపీ సూచించాలని కోరారు. ఎవరు ఏ పనిచేశారో వారికి ఆ క్రెడిట్ దక్కాల్సిన అవసరం ఉందన్నారు. 

ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదన్నారు. టీడీపీ సభ్యులు గొడవ చేయాలనే అసెంబ్లీకి వచ్చారని సీఎం చెప్పారు.  అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూడా ఉంటే ఎందుకు వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీకి పేరు పెట్టాల్సి వచ్చిందో అర్ధమయ్యేదన్నారు. 

హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చాలని నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకున్నట్టుగా ఏపీ  సీఎం చెప్పారు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకన్నామని వైఎస్ జగన్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం కంటే ముందే మూడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మూడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. తాను  సీఎంగా ఎన్నికయ్యాక మరో 17 కాలేజీలు రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు కాలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. 

గతంలో చంద్రబాబు, రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణను మంత్రి రజని అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఎన్టీఆర్ పేరు లేకుండా ఎలా చేయాలని చంద్రబాబు, రాధాకృష్ణలు చేసిన కుట్రలను మనం చూశామన్నారు. 

ఎంతోమందిని రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారని సీఎం జగన్ చెప్పారు చివరకు మోడీ కూడా తనకంటే జూనియర్ అని చెప్పుకున్నారన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి ఎన్టీఆర్ కు ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.  ఆరోగ్యశ్రీ, 104, 108 అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు  వైఎస్ఆర్ అని సీఎం జగన్ చెప్పారు. వృత్తి రీత్యా వైఎస్ఆర్ ఒక డాక్టర్ అని సీఎం గుర్తు చేశారు. . పేదవాడి సమస్యలు, జీవితాలు అర్ధం చేసుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అని జగన్ చెప్పారు. వైద్యరంగంలో సంస్కర్త వైఎస్ఆర్  అని జగన్ కొనియాడారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవాతవాద మహా శిఖరం వైఎస్ఆర్ అని జగన్ చెప్పారు.

1983 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా టీడీపీ తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 28 మెడికల్ కాలేజీల్లో 20 మెడికల్ కాలేజీలను తాను,తనండ్రి వైఎస్ఆర్ తీసుకువచ్చారని జగన్ స్పష్టం చేశారు. 

also read:అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు : చంద్రబాబుపై మంత్రి రజనిఫైర్

వైద్య రంగంలో సంస్కరణల్లో నాన్న ఒక్క అడుగువేస్తే తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నానని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసకున్న రోగులకు నెలకు రూ. 5 వేలు ఇస్తున్నామని కూడా ఆయన గుర్తు చేశారు 10 వేలకు పైగా గ్రామాల్లో వైఎస్ఆర్ క్లినిక్స్ వస్తున్నాయన్నారు. అన్ని ఆసుపత్రుల రూపు రేఖలను మారుస్తున్నామని జగన్ ప్రకటించారు. మూడేళ్లలో వైద్య శాఖలో 40, 500 మందికి ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.ఈ కారణాలతో హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పెట్టడం సమంజసంగా భావిస్తున్నట్టుగా  సీఎం తెలిపారు. 
 

click me!