జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. వారాహి యాత్రపై సీఎం జగన్ సెటైర్లు వేశారు.
కురుపాం: పవన్ కళ్యాణ్ నోటికి అదుపు లేదు, నిలకడ లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ప్యాకేజీ స్టార్ ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సీఎం జగన్. నలుగురిని పెళ్లి చేసుకోని భార్యలను మార్చలేమని పవన్ కళ్యాణ్ నుద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకు వచ్చారన్నారు. ఇవన్నీ వారికే చెందిన పేటెంట్ అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాంలో బుధవారంనాడు జగనన్న అమ్మఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం, బూతులు తిట్టలేమని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శించారు. దత్తపుత్రుడికి నిలకడ లేదు, మాట మీద నిలబడే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ నుద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడిలా పూనకం వచ్చినట్టుగా తిట్టలేమన్నారు.
45 ఏళ్ల పాటు రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా పనిచేశారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు 15 ఏళ్ల క్రితం దత్తపుత్రుడు తోడుగా నిలిచాడని సీఎం జగన్ గుర్తు చేశారు. 2014లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తామని ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సంతకాలు పెట్టిన కరపత్రాలు పంచారన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. కానీ చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నించారు.