వైసీపీకి ఓటేయ్యకుంటే.. చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది : చంద్రబాబుపై పంచ్‌లు విసిరిన జగన్

By Siva Kodati  |  First Published Feb 3, 2024, 5:23 PM IST

మీరు వైసీపీకి ఓటు వేయకుంటే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని.. ఒక డ్రాకులలా తయారై జనం రక్తాన్ని పీల్చేస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తొచ్చారని.. రా కదలిరా అంటూ ప్రజలను కాదు, పార్టీలను పిలుస్తున్నాడని జగన్ దుయ్యబట్టారు. 


మీరు వైసీపీకి ఓటు వేయకుంటే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని.. ఒక డ్రాకులలా తయారై జనం రక్తాన్ని పీల్చేస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రామాయణం, మహాభారతంలో వున్న విలన్లు ఇప్పుడు చంద్రబాబు అండ్ కో రూపంలో వున్నారని అన్నారు.

దుష్ట చతుష్టయం మీద యుద్ధం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ సీన్ చూస్తుంటే జగన్ ఒంటరిగా కనిపిస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఏనాడూ ఒంటరి కాదని.. మీరు కృష్ణుడి పాత్రను పోషిస్తే.. తాను అర్జునుడిని అవుతానని జగన్ పేర్కొన్నారు. పెత్తందారులు ఎవరిపైన దాడులు చేస్తున్నారో ఆలోచించండి అని ఆయన పిలుపునిచ్చారు. దేవుడు, ప్రజలే నా తోడు, నా బలమని జగన్ తెలిపారు. 

Latest Videos

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మీ కోసం ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఏనాడైనా ఒక్క రూపాయి వేశాడా అని ఆయన నిలదీశారు. ఆయన మూడుసార్లు సీఎం అయ్యారని.. జన్మభూమి కమిటీలు లంచాలకు మారుపేరని జగన్ ఎద్దేవా చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, చంద్రబాబు ఏనాడూ పేదలను పట్టించుకోలేదని జగన్ దుయ్యబట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. డీడీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని జగన్ వెల్లడించారు. 

నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నామని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు , దత్తపుత్రుడు, ఇతర తోడేళ్లు ఏకమయ్యాయని .. వీళ్లంతా నాపై పోటీకి సిద్ధమయ్యారని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది వైసీపీయేనని సీఎం అన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్, ఒక మహిళా పోలీస్ వుంటారని జగన్ చెప్పారు. అందరికీ వైద్యం అందాలని ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారని.. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలన్నారు. జగనన్న మీ కోసం 184 సార్లు బటన్ నొక్కాడని.. జగనన్న కోసం మనం రెండుసార్లు బటన్ నొక్కలేమా అని ప్రతి ఇంట్లో చెప్పాలని శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. డీబీటీ ద్వారా 2.55 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. 

ప్రతిపక్షాలకు ఓటు వేయడమంటే ఈ స్కీముల రద్దుకు మనం ఆమోదం తెలిపినట్లేనని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్నకు మోసం చేసే అలవాటు లేదని.. ప్రతిపక్షానికి ఓటు వేయడమంటే మళ్లీ లంచాలు, వివక్షను బ్రతికించినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు. 14 ఏళ్లు సీఎంలా చేసిన వ్యక్తికి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదని.. అందుకే పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో ప్రతిపక్ష రాజకీయం సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తొచ్చారని.. రా కదలిరా అంటూ ప్రజలను కాదు, పార్టీలను పిలుస్తున్నాడని జగన్ దుయ్యబట్టారు. 

ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుడిని, వదినమ్మను పిలుస్తున్నాడని.. రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చేందుకు రమ్మంటున్నాడని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రులని, ప్రజలతో పనిపడినప్పుడే వారికి ఈ రాష్ట్రం గుర్తొస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సైకిల్ తొక్కడానికి ఇద్దరిని, తోయడానికి మరో ఇద్దరిని చంద్రబాబు తెచ్చుకుంటున్నాడని జగన్ సెటైర్లు వేశారు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు ఆంధ్ర రాష్ట్రంతో పనేంటి అని ఆయన ప్రశ్నించారు. ఒక్కడి మీద కలబడి వంద మంది 100 బాణాలు వేస్తున్నప్పుడే ప్రజలే రక్షణ కవచంలా మారి పుట్టిన పార్టీ వైసీపీ అని జగన్ అన్నారు. 
 

click me!