ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాను: జగన్ అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Sep 25, 2021, 8:45 PM IST
Highlights

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. దీనిపై క్యాంప్ కార్యాలయంలో ఆయన అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తుపాను తీరం దాటాక భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందున.. తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. దీనిపై క్యాంప్ కార్యాలయంలో ఆయన అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తుపాను తీరం దాటాక భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందున.. తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సచివాలయాల వారీగా అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.  

ALso Read:హైదరాబాద్‌లో కుండపోత వర్షం: బయటకు రావొద్దు.. ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

కాగా, బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గోపాల్‌పూర్‌కి 510 కి.మీ తూర్పు ఆగ్నేయ దిశలో.. కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. ఇది గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

తుపాను తీరం దాటే సమయంలో పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తుఫాను నేపథ్యంలో ఏపీ, ఒడిశాలలో 18 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. ఉత్తరాంధ్ర, గంజాం, గజపతి జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఐఎండీ తెలిపింది.  
 

click me!