జనవరి నుంచి ఏపీలో సమగ్ర భూసర్వే: జగన్ కీలక ఆదేశాలు

Siva Kodati |  
Published : Oct 22, 2020, 09:05 PM IST
జనవరి నుంచి ఏపీలో సమగ్ర భూసర్వే: జగన్ కీలక ఆదేశాలు

సారాంశం

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాశ్వతంగా భూ హక్కు కల్పించే సమగ్ర సర్వేకు సంబంధించిన ఏర్పాట్లు, టైటిల్‌ తదితర వివరాలతో పాటు, కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎం కు వివరించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. శాశ్వత భూహక్కు  కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని, దీనిని పక్కాగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న సమగ్ర భూసర్వే మొదలు కావాలని జగన్ ఆదేశించారు.

వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని.. దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూ రికార్డుల డిజిటలైజేషన్‌ అవుతుందని సీఎం పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ.. డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే సచివాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గతంలో రికార్డులు ట్యాంపర్‌ చేయడానికి చాలా అవకాశం ఉండేదని.. ఆ పరిస్థితి పూర్తిగా మారాలని కోరారు. ఎవ్వరు కూడా రికార్డులు తారుమారు (ట్యాంపర్‌) చేసే అవకాశం లేకుండా డిజిటైజేషన్ జరుగుతుందని జగన్ పేర్కొన్నారు.

కాగా, అంతకు ముందు సమీక్షా సమావేశంలో అధికారులు పలు అంశాలను వివరించారు. వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని,  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వారు సీఎంకు వివరించారు.

భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్‌) ద్వారా శాటిలైట్ ఫోటోలు పొందడం, ఆ ఇమేజ్‌ను ప్రాసెస్‌ చేయడం, క్షేత్రస్థాయి పరిశీలన, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.

డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్‌ ద్వారా ఫోటో తీస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో జనవరి 2023 నాటికి పూర్తవుతుందని, మూడు దశల్లో సర్వే కొనసాగుతుందని వివరించారు.

సమగ్ర భూసర్వే కోసం 70 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్(బేస్‌ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్నింటిని ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్‌ (విలేజ్‌) కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు కూడా ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు వెల్లడించారు.
 

PREV
click me!

Recommended Stories

Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
AP Road Accident : చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి కారణమేంటో తెలుసా?