వ్యాక్సినేషన్‌పై జగన్ సమీక్ష.. ప్రైవేట్‌లో నిరుపయోగంగా టీకాలు, కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం

By Siva KodatiFirst Published Jul 28, 2021, 3:16 PM IST
Highlights

వ్యాక్సిన్ల కేటాయింపుపై మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కేటాయించిన డోసుల్ని ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
 

ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ అనంతరం అక్కడి కరోనా పరిస్ధితులపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. దీని కోసం ఒక కమిటీని నియమించాలని జగన్ ఆదేశించారు. ఆ తర్వాత నివేదిక సమర్పించాలని సూచించారు. కరోనా నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం వుందన్నారు సీఎం జగన్.

మరోవైపు వ్యాక్సిన్ల కేటాయింపుపై మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు జగన్. కేటాయించిన డోసుల్ని ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మూడు నెలల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు 43 లక్షలకు పైగా డోసుల్ని ఇస్తే.. కేవలం 5 లక్షలు మాత్రమే ఉపయోగించాయని సీఎం జగన్ చెప్పారు.

వాటిని ప్రభుత్వానికి కేటాయిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుందని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపైనా జగన్ సమీక్షించారు. 100 బెడ్లు వున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. తర్వాత మిగిలిన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీని ఇస్తున్నామని సీఎం తెలిపారు.

కొత్త మెడికల్ కాలేజీల కోసం పెండింగ్‌లో వున్న భూసేకరణ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సీలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని సీఎం కోరారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలని .. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 
 

click me!