
ఈ నెల 23 నుంచి 25 వరకు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్చువల్‌గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా సురక్ష కార్యక్రమం నిర్వహించాలన్నారు.
ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని జగన్ ఆదేశించారు. గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారు ఇంటికెళ్లి వివరించాలని సీఎం కోరారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కల్తీ విత్తనాల పట్ల అప్రమత్తంగా వుండాలన్నారు. అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్ట్ 1 నుంచి పథకాలు మంజూరు చేయాలని జగన్ ఆదేశించారు.
ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలని.. ఇందులో 60 శాతం పనిదినాలు ఈ నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. ఇప్పటి వరకు 3.9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలని.. ఆప్షన్ 3ని ఎంపిక చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఖరీఫై ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలని.. నాడు - నేడు కింద పనులు పూర్తి చేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు.