వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో జగన్ మాట్లాడారు.
అమరావతి:పేదరికం నుండి బయటపడే ఆయుధం చదువు ఒక్కటేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చదువు అనే బ్రహ్మస్త్రం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారంనాడు విడుదల చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ నుండి వివాహం చేసుకున్న లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. 18,883 జంటలకు ఈ పథకం కింద లబ్ది జరగనుంది.ఈ పథకానికి ప్రభుత్వం రూ. 141. 60 కోట్లు ఖర్చు చేస్తుంది.
ఈ సందర్భంగా వర్చువల్ లబ్దిదారులతో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ పథకం కింద వధువుల తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఈ పథకం కింద నిధులు అందాలంటే వధూవరులిద్దరికీ టెన్త్ ఉత్తీర్ణత తప్పనిసరి చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.దీంతో పేరేంట్స్ తమ పిల్లలను కచ్చితంగా చదివిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ డిగ్రీ వరకు చదవాలని సీఎం కోరారు. ప్రతి ఏటా నాలుగు విడతలుగా నిధులను పంపిణీ చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వంలో ఏదో చేశామంటే చేశామన్న విధంగా ఉండేదని జగన్ విమర్శలు గుప్పించారు.ఏ రోజు కూడ గత ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయలేదన్నారు. గతంలో లబ్దిదారులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని సీఎం జగన్ విమర్శలు చేశారు.వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు పేద విద్యార్థుల పెద్ద చదువులకు తోడుగా నిలబడుతుందన్నారు.