
విజయవాడలో తప్పుడు పత్రాలతో సిమ్ కార్డుల దందా వెలుగుచూసింది. ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ కావడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (టీవోటీ) అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను పోలీస్ కమీషనర్ కాంతిరాణా ఆదేశించారు. ఈ క్రమంలోనే సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్ చేరసినట్టుగా గుర్తించారు.
పోలీస్ కమీషనర్ కాంతిరాణా మాట్లాడుతూ.. ‘‘ఒకే ఫోటోపై 658 సిమ్ కార్డులు జారీ చేసినట్లు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (డీవోటీ) ఫిర్యాదు చేసింది. సమగ్ర దర్యాప్తు చేయాలని సూర్యారావుపేట పోలీసులను ఆదేశించడం జరిగింది. పోలీసులు విజయవాడలోని సత్యనారాయణపురంకు చెందిన నవీన్ అనే వ్యక్తిని పట్టుకున్ానరు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని విచారిస్తున్నాం. అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో తప్పుడు పత్రాల ద్వారా అదనంగా 150 సిమ్‌కార్డులు లభించాయి’’ అని తెలిపారు.
అయితే పోలీసుల ప్రకారం.. ఏఐ టూల్‌కిట్‌ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ల శాఖ ఈ మోసాన్ని గుర్తించింది. ASTR (టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్)ని అమలు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక, నకిలీ పత్రాలతో జారీ చేయబడిన సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు, డీవోటీ సంయుక్తంగా పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే అటువంటి సిమ్ కార్డులు ఉగ్రమూకలకు చేతికి చేరితే ఊహించని పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.