రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అమరావతి:రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మత్స్యకార భరోసా నిధులను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో మాట్లాడారు. ఈ ఏడాది 1 .19 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకూర్చనున్నట్టుగా ఆయన చెప్పారు. కరోనా పరిస్థితుల్లో ఈ సహాయం మత్స్యకారుల కుటుంబాలను ఆదుకొంటుందని ఆయన తెలిపారు.
అవినీతికి తావులేకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు, చేపల వేట నిషేధ సమయంలో ప్రతి ఏటా రూ. 10 వేలను ఆర్ధిక సహాయంగా అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వరుసగా మూడో ఏడాది మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తున్నారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఏం చేయలేదని ఆయన చెప్పారు. అక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అర్హులైన ప్రతి లబ్దిదారుడికి నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. అక్వా సాగు చేసేవారికి ప్రతి నియోజకవర్గానికి ఒక అక్వా ఇంటిగ్రేటేడ్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. మూడేళ్లలో రూ. 331.58 కోట్లను మత్య్సకారులకు అందించినట్టుగా ఆయన చెప్పారు.