చంద్రబాబుకు షాక్: టీడీపీకి మైనారిటీ కమిషన్ చైర్మన్ గుడ్ బై

By telugu teamFirst Published May 18, 2021, 7:57 AM IST
Highlights

ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు తీరుపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మాజీ మంత్రి లాల్ జాన్ బాషా కుటుంబానికి చెందినవారు.

లాల్ జాన్ బాషా కుటుంబం టీడీపీకి ఎంత చేసినా చంద్రబాబు మాత్రం అన్యాయమే చేశారని జియావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏ విధమైన పదవి ఇవ్వకపోయినా చంద్రబాబులో మార్పు రావాలని ఎదురు చూసినట్లు ఆయన తెలిపారు. అధికారం కోల్పోయినా కూడా చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. 

ఆ మేరకు జియావుద్దీన్ ఓ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన సోదరుడు స్వర్గీయ లాల్ జాన్ బాషా, తన కుటుంబ సభ్యులందరూ స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలోన పార్టీకి పూర్తి అంకిత భావంతో పనిచేశామని, ఆ తర్వాత పరిణామాల ప్రక్రియలో చంద్రబాబు నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా పార్టీ అభ్యున్నతికి కృషి చేశామని ఆయన అన్నారు. 

పార్టీ కోసం, రాజకీయంగా తన ఎదుగుదల కోసం చంద్రబాబు తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా వాడుకున్నారని, అయితే లాల్ జాన్ బాషా మరణించిన తర్వాత రాజకీయంగా ఇబ్బందులకు గురిచ చేశారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసునని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అది కోల్పోయిన తర్వాత మరో రకంగా చంద్రబాబు ప్రవర్తిస్తూ తమతో సహా పార్టీలో వ్యక్తిత్వం కలిగినవారికి మొదటి నుంచి కూడా చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయన అన్నారు. 

అధికారం కోల్పోయిన తర్వాత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమ రాజును ఓ పావులా వాడుకుంటు్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేశారని ఆయన తప్పు పట్టారు. 

మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన చేసిన చంద్రబాబు రాజకీయం టీడీపీకి మరణశాసనంగా మారిందని, చంద్రబాబు మాత్రం మారలేదని ఆయన అన్నారు. రఘురామకృష్ణమ రాజును చంద్రబాబు సమర్థిస్తున్నారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. 

click me!