వందకు 97 మార్కులిచ్చారు: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జగన్

By narsimha lodeFirst Published Nov 17, 2021, 6:30 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఘన విజయం కట్టబెట్టడంపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. 100కు 97 మార్కులు వేశారన్నారు. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ప్రజలంతా పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారన్నారు.

అమరావతి:  ప్రజల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి వందకు   97 మార్కులు వేశారని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పారు. గ్రామాలతో పాటు నగరాల్లో కూడ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయితీల్లో  100 కు 97 మార్కులు వేసిన అవ్వా, తాతలు, అక్కా చెల్లెళ్లు సోదరులందరికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పోరేషన్లలో వైసీపీ జోరు కొనసాగింది.కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పోలింగ్ నిర్వహించింది. ఇవాళ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.

— YS Jagan Mohan Reddy (@ysjagan)

 టీడీపీకి గట్టి పట్టున్న కుప్పం, పెనుకొండ లాంటి స్థానాల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది.  ఈ పరిణామం టీడీపీకి షాకిచ్చింది.  అయితే కుప్పంలో ఓటమికి దొంగ ఓట్లే కారణమనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు ముందుకు తెచ్చారు. దొంగ ఓట్లతోనే చంద్రబాబు విజయం సాధిస్తున్నారని వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. కుప్పంలో విజయం సాధించడంతో పుంగనూరులో తనపై పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. కుప్పంలో ఓటమి చెందడంతో  రాజకీయాల నుండి వైదొలగాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుకుసలహా ఇచ్చారు.

also read:AP Municipal Election Results 2021: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ ఖాతాలో దర్శి..ఫైనల్ రిజల్ట్స్ ఇవే

ఈ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై టీడీపీ కూడా స్పందించింది. ప్రజలపై నమ్మకం ఉన్న వైసీపీ నేతలు  అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. అధికారులను అడ్డు పెట్టుకొని అక్రమాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.

 మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబు సాకులు వెతుకుతున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సమయంలో ఈవీఎంలు, ఇవాళ దొంగ ఓట్లతో ఓటమి పాలైనట్టుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు సాకులు చెబుతున్నారని బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ జనసేన, బీజేపీ నామమాత్రపు విజయాలను సాధించింది.

click me!