AP Municipal Election Results 2021: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ ఖాతాలో దర్శి..ఫైనల్ రిజల్ట్స్ ఇవే

By team teluguFirst Published Nov 17, 2021, 5:29 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల్లో (AP Municipal Elections) వైఎస్సార్‌సీపీ మరోసారి సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్‌తో (nellore corporation election) పాటు 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. దర్శి మున్సిపాలిటీ (darsi municipality) మినహా మిగిలిన అన్ని చోట్ల విజయం సాధించింది.

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల్లో (AP Municipal Elections) వైఎస్సార్‌సీపీ మరోసారి సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్‌తో (nellore corporation election) పాటు 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా.. దర్శి మున్సిపాలిటీ (darsi municipality) మినహా మిగిలిన అన్ని చోట్ల విజయం సాధించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ పోరులో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే పెండింగ్‌లో ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌తో కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పోలింగ్ నిర్వహించింది. 

వీటితో పాటుగా గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 353 డివిజిన్లు, వార్డులకు.. 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 325 స్థానల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 1206 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు.

నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా ప్రతిచోట వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. TDP కంచుకోటలుగా పేరున్న కుప్పం (Kuppam), పెనుకొండలలో (penukonda) కూడా వైసీపీ ఘన విజయం సాధించింది. గత కొంతకాలంగా ఎన్నికల్లో పరాజయాలను చూస్తున్న టీడీపీకి.. ఈ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కేవలం ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. కొండపల్లిలో మాత్రం వైసీపీ టీడీపీ గట్టిపోటీ ఇచ్చింది. కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్థులు కూడా గెలుపొందారు. అయితే బీజేపీ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. 

కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్..
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ పాగా వేసింది. కుప్పం మున్సిపాలిటిలో (Kuppam municipal result) మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవంతో కలిపి వైసీపీ 19 స్థానాలు సొంతం చేసుకుని కుప్పం మున్సిపల్ పీఠం దక్కించుకుంది. ఇక, టీడీపీ 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. 

Also read: Penukonda municipal results: పరిటాల ఇలాకాలో టీడీపీకి వరుస షాక్‌లు.. పెనుకొండలో ఘోర పరాభవం..

కొండపల్లిలో కీలక పరిణామం..
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో (kondapalli municipality result) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా తలపడ్డాయి. మొత్తం 29 వార్డులు ఉండగా.. అక్కడ టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో విజయం సాధించాయి. మరో స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది. అయితే కొండపల్లి మున్సిపల్ పీఠాన్ని ఎవరూ దక్కించుకుంటారనే ఎక్స్ ఆఫీషియో సభ్యులపై ఆధారపడి ఉంది. అయితే వైసీపీ అధికార పార్టీ కావడంతో కొండపల్లి మున్సిపల్ పీఠం ఆ పార్టీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. 

జగ్గయ్యపేటలో ఉద్రిక్తత..
జగ్గయ్యపేట (jaggaiahpet municipality) ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ మొత్తం 31 స్థానాలు ఉండగా.. తొలి రౌండ్‌లో 16 వార్డులకు ఓట్ల లెక్కింపు జరిగింది. అందులో టీడీపీ-8, వైసీపీ-8 చోట్ల గెలుపొందాయి. అయితే కొన్ని స్థానాల్లో (టీడీపీ అభ్యర్థులు తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల్లో) రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. అది కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే రీ కౌంటింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం  చోటుచేసుకుది.  ఆ తర్వాత రెండో రౌండ్‌లో మిగిలిన వార్డులకు ఓట్ల లెక్కింపు కొనసాగింది.

Also Read: YSRCP Victory in Kuppam: కుప్పం విక్టరీ.. ఆనందంలో సీఎం జగన్.. మంత్రి పెద్దిరెడ్డికి అభినందనలు..


నెల్లూరు కార్పొరేషన్(మొత్తం స్థానాలు-54)- వైసీపీ 54, టీడీపీ-0, జనసేన
కమలాపురం మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు -20)- వైసీపీ-15, టీడీపీ-5
రాజంపేట మున్సిపాలిటీ (మొత్తం స్థానాలు-29)- వైసీపీ-24, టీడీపీ -4, ఇతరులు-1
పెనుకొండ మున్సిపాలిటీ (మొత్తం స్థానాలు-20)- వైసీపీ-18, టీడీపీ-2
ఆకివీడు మున్సిపాలిటీ (మొత్తం స్థానాలు -20)- వైసీపీ-12, టీడీపీ -4, జనసేన-3, ఇతరులు-1
జగ్గయ్యపేట మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు-31)- వైసీపీ-18, టీడీపీ-13
దాచేపల్లి మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు-20)- వైసీపీ-11, టీడీపీ-7, జనసేన-1, ఇతరులు-1
గురజాల మున్సిపాలిటీ (మొత్తం స్థానాలు-20)- వైసీపీ-16, టీడీపీ- 3, జనసేన-1
దర్శి మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు-20)- వైసీపీ -7, టీడీపీ -13
బుచ్చిరెడ్డి పాలెం మున్సిపాలిటీ (మొత్తం స్థానాలు-20)- వైసీపీ-18, టీడీపీ-2
కుప్పం మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు-25)- వైసీపీ-19, టీడీపీ-6
కొండపల్లి మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు-29)- వైసీపీ-14, టీడీపీ- 14, ఇతరులు-1
బేతంచర్ల మున్సిపాలిటీ(మొత్తం స్థానాలు- 20)- వైసీపీ -14, టీడీపీ -6

- గ్రేటర్ విశాఖలో 31, 61 డివిజన్లకు జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 


మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో..
ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ పోరులో వైసీపీ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. 11 కార్పొరేషన్‌లతో పాటుగా 74 మున్సిపాలిటీలను (ఎన్నికలు జరిగిన మొత్తం 75 మున్సిపాలిటీలకు) వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం తాడిపత్రి మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. మైదుకూరులో వైసీపీ కంటే టీడీపీ ఒక వార్డు ఎక్కువ సాధించినప్పటికీ ఎక్స్ అఫీషియో స‌భ్యుల‌తో వైసీపీ ఆ పీఠాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు పెండింగ్‌లో ఉన్న ఏలూరు కార్పొరేషన్‌ కూడా ఆ తర్వాత వైసీపీ ఖాతాలోకే వెళ్లింది.

click me!