
రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్న ఆయన... నెలలో కనీసం 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా, క్షేత్రస్థాయిలో పర్యటనలకే సరైన ఫీడ్‌బ్యాక్ వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.
ప్రజలు, లబ్ధిదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ప్రభుత్వానికి కీలకమని... రాత్రిపూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. రాత్రి నిద్రతో క్షేత్రస్థాయి పరిస్ధితులు మెరుగుపడతాయని, కొంతమంది కలెక్టర్లు పర్యటనలకు వెళ్లడం లేదని తన దృష్టికి వచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read:మారితే గౌరవిస్తా.. లేదంటే జగన్ రెడ్డి అనే పిలుస్తా: తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్
మండల స్థాయి అధికారులతో ఇక నుంచి వారానికి రెండు సార్లు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. మంగళవారం ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఒకసారి, వారంలో రెండో దఫా మరో సారి మాత్రమే కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం సూచించారు.
వెంటనే ఈ పద్ధతి మారాలని.. ప్రతి కలెక్టర్ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల హాస్టల్స్ లేదా ఆస్పత్రిలో ఎక్కడో ఒక చోట నిద్ర చేయాలన్నారు. పరిపాలనలో జిల్లా కలెక్టర్లే నా కళ్లు, చెవులు అని... ప్రజలకు, ప్రభుత్వానికి వారే వారధి లాంటి వారని సీఎం తెలిపారు.
Also Read:''టిటిడి వెబ్‌సైట్‌లో 'శ్రీ యేసయ్య' ప్రస్తావన... వైఎస్సార్ కు పట్టిన గతే జగన్ కు''
మరోవైపు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ‘‘విశ్రాంతి భృతి’’ అందించే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి సోమవారం గుంటూరులో ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ఆయన ప్రసంగించనున్నారు.