ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై స్పందించిన జగన్.. అధికారులపై ప్రశంసలు

By Siva KodatiFirst Published Apr 20, 2020, 4:07 PM IST
Highlights

రాష్ట్రంలో వివాదంగా మారిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ సొమ్మును కాపాడాలన్న ఆలోచన చేసిన వైద్య ఆరోగ్యశాఖను అభినందిస్తున్నా అన్నారు. 

రాష్ట్రంలో వివాదంగా మారిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ సొమ్మును కాపాడాలన్న ఆలోచన చేసిన వైద్య ఆరోగ్యశాఖను అభినందిస్తున్నా అన్నారు.

చాలా నిజాయితీగా ఆలోచన చేసి ఆర్డర్‌ చేశారని జగన్ కొనియాడారు. మనకు కిట్లు అనేవి అవసరం, కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితని.. ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీరు కొనుక్కోండని కేంద్రం చెప్పిందని సీఎం గుర్తు చేశారు.

Also Read:ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు, మొత్తం 722: మృతుల సంఖ్య 20

ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన కంపెనీకి రాష్ట్ర వైద్య  ఆరోగ్యశాఖ ఆర్డర్‌ ఇచ్చిందని జగన్ గుర్తుచేశారు. ఆర్డర్‌ ప్లేస్‌ చేసినప్పుడు పర్చేజ్‌ ఆర్డర్‌లో షరతు పెట్టారని సీఎం తెలిపారు.

ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే.. ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టం చేశారని సీఎం చెప్పారు. ఇలాంటి ఆలోచన సాధారణంగా అయితే ఎవ్వరూ చేయరని, ఎలాంటి రాజీపడకుండా, కిట్లను తెప్పించడంలో ఆలస్యం చేయకుండా అధికారులు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని జగన్ అన్నారు.

ఇప్పటివరకూ 25శాతం మాత్రమే పేమెంట్ ఇచ్చారని... ఇంత ఒత్తిళ్ల మధ్య మంచి ఆలోచనతో కొనుగోలు చేశారని ముఖ్యమంత్రి చెప్పారు. అవినీతి అన్నది ఎక్కడా లేకుండా ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా అధికారులు  పనిచేస్తున్నారని, తనకు చాలా సంతోషంగా ఉందని జగన్ అన్నారు.

Also Read:పోలీసుల దాడిలో సత్తెనపల్లి యువకుడి మృతి... చంద్రబాబు సీరియస్

మనం ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారు అయ్యాయని.. ఇప్పుడు అదే కంపెనీ మన దేశంలో తయారుచేయడానికి ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.

మనం పెట్టుకున్న షరతు కారణంగా రేటు కూడా తగ్గబోతుందని, దీనికి కూడా ఆ కంపెనీ అంగీకరించిందని జగన్ అన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని రాజీపడకుండా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. 

click me!