మోడీతో జగన్ భేటీ: 14 అంశాలపై వినతి పత్రం

By narsimha lodeFirst Published Mar 17, 2023, 12:10 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారంనాడు  ప్రధాని మోడీతో  ఇవాళ  సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  శుక్రవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో   మోడీతో  జగన్  సమావేశమయ్యారు. సుమారు  45 నిమిషాలపాటు ప్రధానితో  జగన్  చర్చించారు.  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై  ప్రధానితో  జగన్  చర్చించినట్టుగా  సమాచారం. 

నిన్న  సాయంత్రం  అమరావతి నుండి  సీఎం జగన్ న్యూఢిల్లీకి  చేరుకున్నారు. నిన్న అసెంబ్లీలో  బడ్జెట్  ప్రవేవ పెట్టిన తర్వాత  ఏపీ సీఎం ఢిల్లీకి  చేరుకోవడం  ప్రాధాన్యత  సంతరించుకుంది.  కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా  ఏపీ సీఎం  జగన్  సమావేశం  కానున్నారు. అమిత్ షాతో పాటు  ఇతర   కేంద్ర మంత్రులతో  కూడ  జగన్  భేటీ అయ్యే అవకాశం ఉంది. 

ప్రధానమంత్రికి  14 అంశాలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  వినతి పత్రం సమర్పించారు.  రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు  కావొస్తున్నా  ఇంకా  సమస్యలు పెండింగ్ లో  ఉన్న విషయాలను  సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.. వీటిపై వెంటనే దృష్టిసారించాలని ఆయన  కోరారు.

 ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని  సీఎం జగన్ గుర్తు  చేశారు. ఇంకా పెండింగులో ఉన్న అంశాలను  పరిష్కరించాలని జగన్ ప్రధానిని కోరారు.  

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ నిధులను వెంటనే విడుదలచేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలివ్వాలని  ఆయన  కోరారు. పోలవరం ప్రాజెక్టు కు కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవరూపంలోకి వస్తుందని  సీఎం  తెలిపారు.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందన్నారు.   

పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందన్నారు.వెంటనే దీనికి ఆమోదం తెలపాలని సీఎం  కోరారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలన్నారు.  

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్ కోకు  రావాల్సిన బకాయిలు ఇప్పించాలని  సీఎం జగన్ కోరారు.  2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు  రూ.7,058 కోట్లు రావాల్సి  బకాయిలున్నాయన్నారు.  వీటిని  వెంటనే ఇప్పించాలని  ఆయన  కోరారు.
 

click me!