
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో (narendra modi) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 45 నిమిషాలకు పైగా ప్రధానితో సీఎం సమావేశమయయారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు (polavaram project), జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలను ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళ్లారు. ఈ మేరకు వినతిపత్రాన్నికూడా అందించారు.
2014-15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్ కింద రాష్ట్రప్రభుత్వానికి రావాల్సి ఉందని జగన్ అందులో ప్రస్తావించారు. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉందని.. ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయాల్సిందిగా సీఎం ప్రధానిని కోరారు. 2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారని జగన్ తెలిపారు. గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారని... రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావని జగన్ స్పష్టం చేశారు. కోవిడ్ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్ (kadapa steel plant) నిర్మిస్తామని హామీ ఇచ్చారని... వాణిజ్యపరంగా ఈ ప్లాంట్ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్‌సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని జగన్ కోరారు. ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేస్తోందని... ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని సీఎం స్పష్టం చేశారు. 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయని.. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాల్సిందిగా వైఎస్ జగన్ ప్రధాని మోడీని కోరారు.