amalapuram violence: మరో 20 మంది అరెస్ట్ .. 48 గంటల పాటు ఈ మండలాల్లో ఇంటర్నెట్ కట్

Siva Kodati |  
Published : Jun 02, 2022, 07:14 PM ISTUpdated : Jun 02, 2022, 07:15 PM IST
amalapuram violence: మరో 20 మంది అరెస్ట్ .. 48 గంటల పాటు ఈ మండలాల్లో ఇంటర్నెట్ కట్

సారాంశం

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కొత్తగా మరో 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 

కోనసీమ జిల్లాలోని (konaseema district) 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్‌ను (internet service) అధికారులు నిలిపివేశారు. అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్ముడి వరం మండలాల్లో ఇంటర్నెట్‌ను కట్ చేశారు. మరోవైపు అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో (amalapuram violence) మరో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 91కి చేరుకుంది. 

ఇకపోతే.. అల్లర్ల నేపథ్యంలో కొనసీమ జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను గత వారం రోజులుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్క్ ఫ్రమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, బ్యాంకింగ్ సేవలపై ఆధారపడిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటిల్ లావాదేవీలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గ్రామ సచివాలయాల్లో కూడా డిజిటల్ ఆధారిత పనులు నిలిచిపోయాయి. 

Also Read:బీజేపీ 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టింది.. ఎక్కడా గొడవల్లేవ్, కోనసీమలోనే ఇలా : సోము వీర్రాజు వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే పలువురు ఇంటర్ నెట్ వినియోగించుకోవడానికి గోదావరి తీరానికి క్యూ కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైపు లంకలు దాటుతున్నారు. మొబైల్స్ సిగ్నల్స్ అందుతున్న చోటుకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. కొందరు తాళ్లరేవు, కాకినాడ, రాజమహేంద్రవరం, యానాం తదితర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్‌నెట్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం లాడ్జీలు, తాత్కాలిక షెల్టర్లలో మకాం వేశారు. వీరంతా కోనసీమలో ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా కోనసీమలో ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని విమర్శలు చేశారు.

అయితే సోషల్‌ మీడియాలో పుకార్ల నియంత్రణ కోసమే ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కొనసీమ జిల్లాలోని మొత్తం 16 మండలాల్లో.. 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించనున్నట్టుగా వెల్లడించారు. ఇక, ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో వాలంటీర్లు బయోమెట్రిక్ లేకుండానే.. రేషన్, పించన్ పంపిణీ చేపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్