పాత వాటికి కొనసాగింపే.. కొత్తది కాదు: రాయలసీమ ఎత్తిపోతలపై షెకావత్‌కు జగన్ లేఖ

By Siva KodatiFirst Published Aug 11, 2020, 8:23 PM IST
Highlights

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. గతంలో షెకావత్ లేఖలో రాసిన అంశాలను జగన్ తప్పుబట్టారు

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. గతంలో షెకావత్ లేఖలో రాసిన అంశాలను జగన్ తప్పుబట్టారు. వీటిపై ఏపీ స్పందించడం లేదనడం కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు.

గత ఒప్పందానికి అనుగుణంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమేనన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇది కొత్త ప్రాజెక్ట్ కిందకు రావని... కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 7న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షెకావత్ రాసిన లేఖకు జగన్ సమాధానమిచ్చారు. మొత్తం 5 పేజీల లేఖ రాశారు.

Also Read:జగన్ పై కేసీఆర్ వ్యాఖ్యలు: ఇరిగేషన్ అధికారులతో ఈ నెల 12న ఏపీ సీఎం రివ్యూ

కాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు ఇరగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడుతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిపై సీరియస్ గా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ  సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

బేసిన్లు బేషజాలు లేవని ఏపీ సీఎంకు చెబితే లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారని ఏపీపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాలతోనే ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ స్పష్టం చేసింది. 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోతిరెడ్డిపాడుపై పట్టుదలగా ఉంది.ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

అపెక్స్ కౌన్సిల్ లో తమ తమ వాదనలను విన్పించాలని రెండు రాష్ట్రాలు కసరత్తు చేసుకొంటున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడ నీటిపారుదల ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం  3 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు.

click me!