మోదీ ప్రతిపాదనకు జై కొట్టిన సీఎం జగన్, కేటీఆర్: జమిలి ఎన్నికలకు మద్దతు

By Nagaraju penumalaFirst Published Jun 19, 2019, 7:59 PM IST
Highlights

దేశవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశానికి 40 పార్టీలకు ఆహ్వానాలు అందజేశామని అయితే ఈ సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యారని తెలిపారు. 21 మంది పార్టీ అధ్యక్షులు హాజరుకాగా మూడు పార్టీల అధ్యక్షలు లేఖల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
 

ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. భారత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ లైబ్రరీ హాలులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనను తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి హాజరైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటె కేటీఆర్ లు మద్దతు పలికారు. 

దేశవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశానికి 40 పార్టీలకు ఆహ్వానాలు అందజేశామని అయితే ఈ సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యారని తెలిపారు. 21 మంది పార్టీ అధ్యక్షులు హాజరుకాగా మూడు పార్టీల అధ్యక్షలు లేఖల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 

సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఒకే దేశం - ఒకేసారి ఎన్నికల అంశానికి మద్దతు పలికాయని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల అంశంపై త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ స్పష్టం చేశారు. 

నిర్ధిష్టకాలపరిమితిలో కమిటీ నివేదిక అందజేయాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. అలాగే లోక్ సభలో సభ సజావుగా కొనసాగేందుకు అందరూ సహకరించేందుకు అంగీకరించారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 

చర్చల ద్వారానే అన్ని అంశాలూ పరిష్కారమవుతాయని ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. వీటితోపాటు నీటి సంరక్షణ, మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమ నిర్వహణపై చర్చ జరిగిందన్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు మరో 10శాతం నిధులు పెంచాలని ఆయా పార్టీల అధ్యక్షులు కోరినట్లు తెలిపారు. 

స్వచ్ఛత అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపోతే అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు గైర్హాజరయ్యాయి.  

click me!