
కేబినెట్ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా రీజినల్ సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జ్‌లను మార్చాలని డిసైడ్ అయ్యారు. తాజాగా విశాఖపట్నం (visakhapatnam) , అనకాపల్లి (anakapalle) పార్లమెంట్ స్థానాల వైసీపీ అధ్యక్షులను మార్చే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (avanthi srinivas) , విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని (karanam dharmasri) నియమించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరిని జగన్ విజయవాడకు పిలిచే ఛాన్సులు వున్నాయి.
ఇవాళ విశాఖ ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల కేబినెట్‌లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలకు ఉపయోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే ఎవరికి ఏ పార్లమెంట్ అప్పగించారన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక‍్టర్ ఘన స్వాగతం పలికారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. అటు వీరికి మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా వున్నాయి.