
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆనందపడే వ్యాఖ్యలు చేసారు. ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం టీచింగ్ స్టాప్ భర్తీకి ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలు ఎక్కడెక్కడ వున్నాయో గుర్తించి వెంటనే భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
''టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. సమర్ధులైన వారిని, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్ స్టాఫ్‌గా తీసుకోవాలి. వారికి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయాలి. టీచింగ్ స్టాఫ్ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలి'' అని సీఎం జగన్ ఆదేశించారు.
''విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో ( జీఈఆర్) గణనీయంగా పెరగాలి. అందుకే విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నాం. పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్ మెంట్‌ను విద్యా దీవెన కింద అమలు చేస్తున్నాం. వసతి ఖర్చులు భరించలేక చదువులు ఆపేసే పరిస్థితులు ఉండకూడదని ప్రభుత్వమే వసతి దీవెన తీసుకు వచ్చాం. దీంతో గతంలో కన్నా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో( జీఈఆర్) పెరిగిన మాట వాస్తవమే. కానీ దీంతో మనం సంతృప్తి చెందకూడదు. జీఈఆర్ మరింత గణనీయంగా పెరగాలి. ఖచ్చితంగా దీన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. జీఈఆర్ 80శాతానికి పైగా ఉండాలి'' అని సీఎం సూచించారు.
''ఉద్యోగాలను కల్పించే చదువులు దిశగా కోర్సులు ఉండాలి. ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధ కోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిషుపై పట్టు, ప్రావీణ్యం విద్యార్థులకు రావాలి. వీటిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. జీఆర్‌ఈ, జీ మ్యాట్ పరీక్షలపైన కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలి'' అని ఆదేశించారు.
''ఇంతకుముందులా కాకుండా ఫీజురీయింబర్స్ మెంట్, వసతి దీవెనలను ఒక పిల్లాడికే పరిమితం చేయడంలేదు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికీ విద్యాదీవెన, వసతి దీవెన ఇస్తున్నాం. ఇంతకుముందు చాలామంది తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేక కేవలం అబ్బాయి చదువుకుంటే చాలని... అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులను పూర్తిగా తీసేయడానికి ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ కూడా విద్యాదీవెన, వసతి దీవెన వర్తింపు చేస్తున్నాం'' అని తెలిపారు.
''రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలాంటి ప్రాంతాల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి'' అని సీఎం ఆదేశించారు.
''రాష్ట్రంలో 4–5 యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని వాటిని దేశంలో ఉత్తమ యూనివర్శిటీల స్థాయికి తీసుకెళ్లాలి. దీన్ని ఒక లక్ష్యంగా తీసుకుని ముందడుగులు వేయాలి. ఇందుకోసం యూనివర్సిటీల్లో అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలి'' అని సూచించారు.
''పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్‌షిప్ ఇవ్వాలి. కోర్సులో భాగంగా వీరికి ఇంటర్న్‌షిప్ కల్పించాలి. మూడు విడతల్లో ఇంటర్న్‌షిప్... మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలల వుండేలా చూడాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్య కాలేజీల్లో కూడా ఇంటర్న్‌షిప్ కోసం ఏర్పాట్లు చేయాలి'' అని సీఎం ఆదేశించారు.
''ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాలి. నియోజకవర్గంలో ఉన్న జూనియర్ కాలేజీని డిగ్రీకాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. దీనికోసం నాడు నేడు కింద పనులు చేపట్టాలి. కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలి. చదువులు ఏదోరకంగా సాగితే చాలు అన్నవాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే భావన ఇవాళ దేశంలో ఉంది. కానీ విదేశాల్లో డిగ్రీ అన్నది చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు. మన రాష్ట్రంలో కూడా డిగ్రీకోర్సులను సమర్థవంతంగా తీసుకురావాలి. ఇప్పుడున్న డిగ్రీ కాలేజీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యారంటే... ఆ విద్యార్థికి మంచి విజ్ఞానం రావాలి'' అన్నారు.
''రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలి. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించండి. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలి. ఏపీలో డిగ్రీలు చదివితే.. మంచి జీతాలు వచ్చే పరిస్థితిని తీసుకురావాలి'' అని సీఎం జగన్ ఆదేశించారు.