జగన్ ప్లాన్: అదే నా వాంఛ, వైఎస్ఆర్‌ను మరిపిస్తారా?

By narsimha lodeFirst Published Jun 24, 2019, 1:28 PM IST
Highlights

రానున్న రోజుల్లో  తన పాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి దూరంగా తమ సర్కార్  పాలన ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చారు

అమరావతి: రానున్న రోజుల్లో  తన పాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి దూరంగా తమ సర్కార్  పాలన ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చారు.  అంతేకాదు వైఎస్ఆర్‌ కంటే తన పాలన ఇంకా బాగుందని  ప్రజల నుండి మెప్పు పొందాలని జగన్ వాంఛగా కన్పిస్తోంది. ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.

 రెండు రోజుల పాటు సాగే కలెక్టర్ల సమావేశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఇవాళ కేవలం కలెక్టర్లు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

వైఎస్ జగన్ సీఎంగా ఎన్నికైన తర్వాత  తొలిసారిగా  నిర్వహించిన  కలెక్టర్ల సమావేశంలో తన ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతోందో ఆయన సంకేతాలు ఇచ్చారు. తన పాలన గురించి ప్రజలు చర్చించుకోవాలనేదే తన ఆకాంక్షగా ఆయన చెప్పారు. ప్రజలు తన పాలన గురించి మంచిగా చెప్పుకోవాలనేదే తన తపన అనే ధోరణిలో  జగన్  ప్రసంగించారు.

ఆయా జిల్లాల్లో కలెక్టర్లు గా పనిచేసిన కలెక్టర్లు ఆ జిల్లాను వీడి బదిలీపై వెళ్లిన సమయంలో  ఆ కలెక్టర్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అలాంటి అధికారులు తమకు రావాలని ప్రజలు కోరుకోవాలని ఆ తరహాలోనే పాలన ఉండాలని  జగన్ అధికారులకు సూచించారు.

తాను కూడ అదే రకమైన పాలనను కోరుకొంటున్నానని  ఆయన చెప్పారు. తన ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలనేది తన వాంఛ అని జగన్ స్పష్టం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. రైతులకు ఉచిత విద్యుత్ , పేదలకు ఆరోగ్య శ్రీ పేరుతో ఉచితంగా వైద్యం లాంటి కార్యక్రమాలను ఆయన ప్రవేశపెట్టారు.

తాను అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలనను తీసుకొస్తామని వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసేందుకు వీలుగా జగన్ సర్కార్ చర్యలు తీసుకొంటుంది. కలెక్టర్ల సమావేశంలో  ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ఈ అంశాలను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని  ఆయన అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలకు భిన్నంగా తన పాలన ఉంటుందని  జగన్  అధికారులకు స్పష్టం చేశారు ప్రజా వేదిక సమావేశంలో కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని కూడ ఆయన వివరించారు నిబంధనలకు విరుద్దంగా ఈ భవనాన్ని నిర్మించారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ నిబంధనలకు విరుద్దంగా ఈ భవనాన్ని నిర్మించి ప్రజలకు ఎలా ఆదర్శంగా ఉంటారని ఆయన చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 

నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేయాలని  ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు ప్రజా వేదిక భవనం కూల్చివేయాలని జగన్ ఈ సమావేశం నుండే ఆదేశించారు.

మరో వైపు జిల్లాల్లో కూడ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని  జగన్  కలెక్టర్లను కోరారు. ఇక ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా అవినీతికి పాల్పడితే  సహించేది లేదని జగన్  చెప్పారు. అవినీతిని తాము ప్రోత్సహించబోమని చెప్పారు. అవినీతిని పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేయాలని కోరారు. గ్రామ వలంటీర్లు అవినీతికి పాల్పడితే అతని స్థానంలో కొత్తవారిని నియమించాలని చెప్పారు. కిందిస్థాయి నుండి తన వరకు అందరూ కూడ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

 ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రతి సోమవారం నాడు గ్రీవెన్స్ డే నిర్వహించాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వినేందుకు ప్రతి మూడో గురువారం సమయాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు.

గత ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు పాల్పడిందని విపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ ఆరోపించింది. తమ ఆరోపణలు నిజమని నిరూపించేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా వేదికను నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన విషయాన్ని డాక్యుమెంట్లతో సహా జగన్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ తరహా పాలనకు భిన్నమైన పాలనను అందించే ఉద్దేశ్యంతోనే తమ సర్కార్ ఉందని జగన్  సంకేతాలు ఇచ్చారు.

మరో వైపు ప్రభుత్వ పథకాల అమలు తీరును  పరిశీలించేందుకు వీలుగా రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా జగన్  స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

click me!