
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి (ap mlc elections) మొదలైంది. పెద్దల సభలో 14 స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సామాజిక వర్గాల ఈక్వేషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ (ysrcp)హైకమాండ్ దాదాపుగా జాబితా సిద్ధం చేసింది. ఎమ్యెల్యే కోటా (mla quota) ఎమ్మెల్సీల్లో 3, స్థానిక సంస్థల (local body quota) కోటాలో 11 స్థానాలు భర్తీకానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుండగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. స్థానిక సంస్థల్లోనూ ఎమ్మెల్యేల బలాల రీత్యా గంపగుత్తగా 14 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం వుంది. దీంతో పలువురు ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక సంస్ధల ఎన్నికల కోటాపై కూడా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ ఛైర్మన్ ఇందుకూరి రఘురాజ్ పేరు తుది జాబితాలో వున్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి వంశీ కృష్ణ యాదవ్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రేసులో వున్న యాదవ్.. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి ఆశించారు. అయితే స్థానిక రాజకీయాలు, సామాజికవర్గ సమీకరణలతో పదవికి అడుగు దూరంలో వుండిపోయిన వంశీ కృష్ణ.. అప్పట్లో వైసీపీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వంశీ కృష్ణను పెద్దల సభకు పంపించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇక తూర్పుగోదావరి స్థానిక సంస్థల కోటాలో అనంతబాబు, కృష్ణా జిల్లా స్థానిక కోటాలో తలసిల రఘురామ్ పేరు వినిపిస్తోంది. ఖమ్మం సామాజిక వర్గానికి చెందిన రఘురామ్.. పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. తలసిల మొదటిసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. కృష్ణా లోకల్ కోటాలో బీసీకి ఇవ్వాలనే ఆలోచనలో వున్నారు జగన్. ఇక గుంటూరు జిల్లా లోకల్ కోటాలో రెండు ఖాళీలు వున్నాయి.
Also Read:స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
చిలకలూరిపేటకు చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు (marri rajashekar) సుధీర్ఘ నిరీక్షణ తర్వాత పదవి వరించనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలవాల్సినప్పటికీ.. చివరి నిమిషంలో అప్పటి టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై (prattipati pullarao) బీసీ మహిళగా విడిదల రజనీని బరిలోకి దింపింది. దీంతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోటీ నుంచి తప్పుకున్న మర్రి రాజశేఖర్‌కు అప్పుడే జగన్ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు నెరవేర్చినట్లు అవుతోంది.
మరో స్థానానికి పదవి కాలం పూర్తయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (ummareddy venkateswarlu) పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో సెంట్రల్ కమిటీ మెంబర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే మండలిలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రకాశం విషయానికి వస్తే.. ఎస్సీ, లేదా రెడ్డీ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం వుందని సమాచారం. చిత్తూరు స్థానిక నియోజకవర్గం నుంచి కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జీగా వున్న భరత్‌కు హైకమాండ్ అవకాశం కల్పిస్తోంది.