సెంటు స్థలం ఇవ్వడానికి పోరాడాల్సి వస్తోంది: జగన్ ఆవేదన

By Siva KodatiFirst Published Nov 18, 2020, 9:41 PM IST
Highlights

ప్రతిపక్షాల కుట్రతో పేదల ఇళ్ల కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గతంలో పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు.

ప్రతిపక్షాల కుట్రతో పేదల ఇళ్ల కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గతంలో పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు.

కానీ పేదలకు సెంటు స్థలం ఇస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. డిసెంబర్ 25న డీ-ఫామ్ ఇస్తూ, ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ నెల 23 నుంచి 30 వరకు టిడ్కో లబ్ధిదారుల దగ్గరకు వాలంటీర్లు ప్రభుత్వ లెటర్ తీసుకెళ్తారని జగన్ చెప్పారు. బాబు స్కీమ్ కావాలా..? జగన్ స్కీమ్ కావాలా అని అడుగుతారని.. ఏ స్కీమ్‌లో ఏముందో లబ్ధిదారులు స్పష్టంగా రాయలని జగన్ విజ్ఞప్తి చేశారు.

బాబు స్కీమ్‌లో రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలని సీఎం చెప్పారు. ఆ తర్వాతే ఇంటిపై వారికి హక్కులు వస్తాయన్నారు.

మా స్కీమ్‌లో కేవలం ఒక్క రూపాయితోనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ అప్పూ లేకుండా ఇప్పుడే సర్వహక్కులతో ఇల్లు ఇస్తున్నామని, ఆ తర్వాత పక్కాగా రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పారు.

డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను.. ఒక్క రూపాయితోనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తామన్నారు. తొలి దశలో 2022 జూన్ నాటికి పూర్తి చేస్తామని.. నవంబర్ 25న జగనన్న తోడు పథకం ప్రారంభిస్తామని జగన్ తెలిపారు.

యూరప్ మొత్తం కోవిడ్‌తో వణుకుతోందని.. ఢిల్లీ మరో లాక్‌డౌన్‌కు సిద్ధంగా వుందన్నారు. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్ చేశారని.. అమెరికాలోనూ ఇబ్బందిగా వుందని సీఎం గుర్తుచేశారు. స్కూళ్లు , కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వుండాలని ఆయన సూచించారు.

చాలా దేశాల్లో సెకండ్ వేవ్ వస్తోందని జగన్ చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించామని.. మొత్తం 30 లక్షల 68,821 మంది పేదలకు ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. సేకరించిన  భూముల మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లని.. కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులకు 90 రోజుల్లో ఇస్తామని చెప్పారు.

1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చామని, 80 వేల మందికి కొత్తగా భూసేకరణ వేగంగా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ 10 లోపు భూసేకరణ, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలని జగన్ కోరారు. 

click me!