చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ను కోల్పోయాం: వైఎస్ జగన్

By Siva KodatiFirst Published Jan 20, 2020, 9:49 PM IST
Highlights

చంద్రబాబుకు రైతులపై ప్రేమలేదని.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ముఖ్యమైన రోజని సీఎం అన్నారు. ఈ సభలో తీసుకునే నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

చంద్రబాబుకు రైతులపై ప్రేమలేదని.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ముఖ్యమైన రోజని సీఎం అన్నారు. ఈ సభలో తీసుకునే నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కర్నూలు రాజధాని మొదలు 2014 వరకు అనేక పరిణామాలు జరిగాయని.. చరిత్ర నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక చారిత్రక తప్పిదాలు జరిగాయని, ఒక మనిషి చేసిన తప్పిదం వల్లే పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకున్నామని జగన్ దుయ్యబట్టారు.

2014లో రాజధాని హైదరాబాద్‌ను వదులుకున్నామని.. తెలుగు ప్రజల ఐక్యత కోసం శ్రీబాగ్ ఒప్పందం జరిగిందని సీఎం గుర్తుచేశారు. ఏపీ అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని జగన్ చెప్పారు.

సూపర్ క్యాపిటల్ వద్దు అని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కాపాడారని సీఎం ఆరోపించారు. రాజధాని నోటిఫికేషన్ కన్నా ముందే టీడీపీ సభ్యులకు అమరావతి గురించి తెలుసునని.. అందువల్లే భూములు కొనుగోలు చేశారని జగన్ మండిపడ్డారు.

శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును టీడీపీ పట్టించుకోలేదని జగన్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకూడదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు. జీఎన్ రావు, బోస్టన్ రిపోర్టులు అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటు వేశాయని సీఎం తెలిపారు.

గతంలో చేసిన తప్పులను హైపవర్ కమిటీ సరిచేసి నివేదిక ఇచ్చిందని.. చంద్రబాబు బినామీ పేర్లతో వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా చంద్రబాబు మార్చేశారని, గుంటూరు నుంచి వెలగపూడి 40 కి.మీ దూరంలో ఉందన్నారు.

విజయవాడ నుంచి వెలగపూడి 20 కి.మీ ఉందని, రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని సీఎం ప్రస్తావించారు. నోటిఫికేషన్ రాకముందే రాజధాని ఎక్కడ వస్తుందని తెలుసుకుని, భూములు ఎడా పెడా కొన్నారని.. ఇప్పటివరకు తెలిసినంత వరకు 4 వేల 70 ఎకరాలు భూములు కొన్నారని జగన్ ఆరోపించారు.

విజయవాడ కరకట్టపై నుంచి ఒక వాహనం కూడా సరిగా ప్రయాణించలేని పరిస్ధితి ఉందన్నారు. చంద్రబాబు నాయడు.. నారాయణ, సుజనా, గల్లా వీరందరితో కమిటీ వేశారని జగన్ ఎద్దేవా చేశారు.

అమరావతి అంటూ చంద్రబాబు భ్రమరావతిని క్రియేట్ చేశారు, 54 వేల ఎకరాల్లో 8 కి.మీ పరిధిలో సౌకర్యాల కల్పనకు లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారని సీఎం గుర్తుచేశారు. అంగుళం పని చేయకుండా చంద్రబాబు సినిమా చూపించారని  జగన్ సెటైర్లు వేశారు.

click me!