
పోస్కో కంపెనీ పెట్టుబడులపై సీఎం జగన్ స్పష్టతనిచ్చారు. వారు విశాఖ రావడానికి తీవ్రంగా యత్నిస్తున్నారనడం సరికాదన్నారు. పోస్కో కంపెనీ రాష్ట్రానికి రావడం తనను కలవడం కూడా వాస్తవమేనని జగన్ అంగీకరించారు.
కానీ కడప, కృష్ణపట్నం, భావనపాడు లాంటి చోట్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరినట్లు జగన్ చెప్పారు. కృష్ణపట్నం, భావనపాడులో పెట్టుబడులు పెట్టేందుకు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేయవలసినదంతా చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం వుండదన్నారు. ఇది ప్రభుత్వ ఆధీనంలో మంచి సంస్థగా కన్వర్ట్ అవుతుందని జగన్ పేర్కొన్నారు.
Also Read:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం: జగన్
ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదని.. అయితే రాబోయే రోజుల్లో సానుకూలమైన నిర్ణయం వస్తుందని నమ్ముతున్నట్లు జగన్ ఆకాంక్షించారు.
అలాగే ఏపీ బీజేపీ నేతలు సైతం ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్లాంట్ ఎక్కడా మూత పడకుండా 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం తగ్గకుండా చూసుకుంటామని జగన్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని సీఎం స్పష్టం చేశారు.