లారీలకు జీపీఎస్, చెక్‌పోస్టుల్లో నైట్ విజన్ కెమెరాలు: ఇసుక అక్రమ రవాణాపై జగన్ యాక్షన్

By Siva KodatiFirst Published Nov 26, 2019, 9:25 PM IST
Highlights

ఇసుకను రవాణా చేసే ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఇసుకను రవాణా చేసే ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా, వైఎస్సార్ నవశకం లబ్ధిదారుల ఎంపికపై సీఎం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా కింద 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయన్నారు. మరో 25 లక్షల మంది రైతులకు ఈ వారంలోగా చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Also Read:చివరికి గేదెలను వాడేస్తున్నారు: కొమ్ములకు వైసీపీ రంగు, ఫోటోలు వైరల్

డిసెంబర్ 15 నుంచి 18 వరకు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని జగన్ సూచించారు. అలాగే ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.263.13 కోట్లు ఖర్చవుతుందని... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటల్లో రోగుల ఖాతాల్లో నగదును జమ చేయాలని సీఎం ఆదేశించారు. మొత్తం 836 రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలన్నారు.

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం వర్తింప జేయాలని డిసెంబర్ 21న ప్రతి నేతన్నకు రూ.24 వేలు జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్‌షాపులపై కలెక్టర్లు దృష్టి సారించాలని.. ధాన్యం సేకరణ, రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు.

మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిసెంబర్ 15 వరకు అవకాశం ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని.. ఇందుకోసం మార్చి 1 కటాఫ్ తేదీగా ప్రకటించారు.

ఆ రోజు నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని, చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ద్వారా వేతనాల చెల్లింపు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.

Also Read:వంశీ లాస్ట్ ఆప్షన్ అదే: వైసీపీ రివేంజ్, కొరకరాని కొయ్యగా వల్లభనేని

జిల్లా స్థాయిలో ఇసుక ధరలు, లభ్యతపై ప్రతివారం పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని జగన్ సూచించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు డిసెంబర్ 10 నాటికి 439 చెక్‌పోస్టులలో నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. ఒక్క ఫోన్ కాల్‌తో అవినీతిపరుల భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. 

click me!