ఏపీ చరిత్రలోనే రికార్డు... వారి ఖాతాల్లో రూ. 42,465కోట్లు: వైఎస్ జగన్

By Arun Kumar PFirst Published Jun 10, 2020, 12:41 PM IST
Highlights

రాష్ట్రంలో కులవృత్తులు చేసుకుంటూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి ఆర్థిక సాయం చేసే పథకం ''జగనన్న చేదోడు'' ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. 

అమరావతి: రాష్ట్రంలో కులవృత్తులు చేసుకుంటూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి ఆర్థిక సాయం చేసే పథకం ''జగనన్న చేదోడు'' ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి ప్రతి ఒక్క లబ్ధిదారుడి  బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మట్లాడుతూ...''ఈ రోజు చేదోడు అనే ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నాం. నిజంగా కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలకు సేవ చేస్తూ కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం'' అన్నారు. 

''కోవిడ్ సమయం, లాక్ డౌన్ సమయంలో వీరి కుటుంబాలు కష్టంగా బతుకుతున్న పరిస్ధితి చూశాం. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతీ మాట ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తాను. ప్రతీ మాట కూడా ఖచ్చితంగా అమలుచేస్తాను. నా పాదయాత్రలో చెప్పిన ప్రతీ హమీ అమలులో భాగంగా ఈ రోజు నా రజక, నాయీ బ్రహ్మణ, దర్జీ వృత్తిలో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు నగదు సహాయం చేయడం చాలా సంతోషాన్నిస్తుంది'' అని తెలిపారు. 

బాలకృష్ణ పుట్టినరోజునే... హిందూపురం ప్రజలకు శుభవార్త

''షాపులున్న రజక, నాయీబ్రహ్మణ, దర్జీ సోదరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున రూ.247 కోట్లు వారి వారి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమచేస్తున్నాం. పాత అప్పులకు ఈ డబ్బు జమ చేసుకోలేని విధంగా చేసిన తర్వాత ఈ డబ్బును వారి అకౌంట్లలో వేస్తున్నాం'' అని వెల్లడించారు.

''గ్రామ వాలంటీర్ల ద్వారా వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేశాం. ఏదైనా అర్హత ఉండి కూడా రాకపోతే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా రాని వారు అర్హత ఉంటే అప్లికేషన్ పెడితే వెరిఫికేషన్ చేసి ఒక నెలరోజుల్లోగా నగదు అందజేస్తాం.ఈ ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది కానీ ఎలా కత్తిరించాలి అని ఆలోచించే ప్రభుత్వం కాదు'' అని పేర్కొన్నారు. 

''ఎవరూ రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాట కూడా చేయగలిగాను అని సగర్వంగా చెప్పగలుగుతున్నా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుక, సున్నావడ్డీ పధకం, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర పథకం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, చేదోడు పథకం, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ళ పట్టాలు ఇలా హామీలన్నింటిని పూర్తిచేస్తున్నాం'' అని వెల్లడించారు.  

''ఈ ఏడాది కాలంలో రూ. 42,465 కోట్లను దాదాపుగా 3.58 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో వేశాం. బహుశా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు. దేవుని దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాలు చేయగలిగాం'' అని  వెల్లడించారు. 

''ప్రభుత్వ పథకాలు ప్రతీ పేదవాడికి అందాలి, నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే అందాలి, అర్హత లేకపోతే అందకూడదు. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు...ఇదే ఈ ప్రభుత్వం ఫిలాసఫీ''  అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 
 

click me!