అందుకే తప్పుడు వార్తలు:ఆ రెండు పత్రికలపై జగన్ ఫైర్

By narsimha lode  |  First Published Jun 28, 2021, 6:51 PM IST

 సీఎం పదవి స్థాయిని దిగజార్చడమే ఉద్దేశ్యంగా రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు పని చేస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
 


అమరావతి: సీఎం పదవి స్థాయిని దిగజార్చడమే ఉద్దేశ్యంగా రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు పని చేస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.కరోనాపై సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ విషయమై స్పందించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతతో ప్రజలు చనిపోతున్నారని ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే మీడియా ఉద్దేశ్యంగా కన్పిస్తోందని ఆయన విమర్శించారు.

70 శాతానికిపైగా ఆక్సిజన్ బెడ్లు, 70 శాతానికి పైగా వెంటిలేటర్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు రావడంతో తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Latest Videos

undefined

రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తికి, ప్రస్తుత అవసరాలకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇక కొరత ఎక్కడవస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆశ్రమ్‌ ఆస్పత్రిలో మరణాలంటూ ఓ పత్రిక రాసిన కథనంపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికలోని వివరాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ముఖ్యమంత్రికి వివరించారు. 

విషమ పరిస్థితుల్లో ఉన్న పి.దొరబాబు అనే వ్యక్తిని మే 25న ఆశ్రమ్‌ ఆస్పత్రిలో చేర్చారని, ఆ వ్యక్తికి డయాబెటిస్‌ సహా ఇతర దీర్ఘకాలిక సమస్యలున్నాయని నివేదికలోని అంశాలను అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సీఎంకు తెలిపారు. దొరబాబు 25 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, జూన్‌ 26న పేషెంట్‌ పరిస్థితి మరింత విషమించిందని, ఆక్సిజన్‌ లెవల్‌ 80 శాతం ఉన్నప్పటికీ శ్వాససంబంధ సమస్య వచ్చిందన్నారు.వెంటనే డాక్టర్లు సీపీఏపీ వెంటిలేటర్‌ మీదకు మార్చి ప్రాణాలు కాపాడేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తోడుకావడంతో మరణించారన్నారు.     

ఓ పత్రికలో  రాసిన విధంగా మరణించిన వారిలో మరో ఇద్దరు జె. నాగలక్ష్మి (42)  కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయారని, ఈమరణానికి శ్వాససంబంధమైన అంశం సమస్యకాదని స్పష్టంచేశారు.55 ఏళ్ల బెంజిమన్‌ అనే వ్యక్తి కూడా కార్డియాక్‌ అరెస్ట్‌కారణంగా మరణించారని ఆశోక్ సింఘాల్ సీఎంకు వివరించారు. ఈ నెల 26వ తేదీన ఆశ్రమం ఆస్పత్రిలో కరెంటు సరఫరా నిలిచిపోలేదని స్పష్టం కలెక్టర్ నివేదిక తెలుపుతోందన్నారు.ఇలాంటి వార్తల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని సీఎం ప్రశ్నించారు.

మరోవైపు మరో పత్రికలో ఉద్దేశపూర్వకంగా రాసిన కొన్నిరాతలనుకూడా సీఎం ప్రస్తావించారు.కోవిడ్‌పై సమీక్షా సమావేశం సందర్భంగా ఇంతమంది అధికారులముందు కరోనా లేదని తాను అన్నట్టుగా, చులకనగా చూశానంటూ రాతలు రాసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. తనను  కోట్‌చేస్తూ ఈ మాటలు రాశారని చెప్పారు.ఎవరైనా ఇలాంటి రాతలు ఎలా రాయగలుగుతున్నారని సీఎం ప్రశ్నించారు. అసలు వీళ్లు మనుషులుగా ప్రవర్తిస్తున్నారా? అని ఆయన అడిగారు.కోవిడ్‌ నివారణా చర్యలపై ఇంత సీరియస్‌గా సమీక్షలు చేస్తుంటే వాటిని అపహాస్యం చేసేలా ఇలాంటి రాతలు రాయడం అత్యంత దురదృష్టకరమన్నారు.

 ఇంతమంది అధికారులకు టైంపాస్‌కాక ఇలాంటి రివ్యూలకు హాజరవుతున్నారా? కరోనా మీద ప్రభుత్వం సీరియస్‌గా లేకపోతే వారానికి రెండురోజులపాటు సమీక్షలు చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.ఇలాంటి రాతలు రాసేముందు కనీసం ఎక్కడోచోటైనా విలువలు ఉండాలి కదా?మీకు  ఏది రాయాలనిపిస్తే అలా రాస్తారా? అని జగన్ చెప్పారు.

కోవిడ్‌ ఎదుర్కోవడంలో మంచిపేరు తనకు, ప్రభుత్వానికే కాదు, అందరి అధికారులకూ, సిబ్బందికి కూడా వస్తుందన్నారు.రాష్ట్రస్థాయి నుంచి మొదలుపెడితే...  గ్రామస్థాయిలో ఉన్న ఆశాకార్యకర్త, ఏఎన్‌ఎం, వాలంటీర్లు,  కలెక్టర్లు,  జిల్లా, మండల అధికారులు, వైద్య సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించడంవల్ల ఇది సాధ్యమైందన్నారు సీఎం. ఈ రెండు పత్రికలు రాసిన వార్తలపై న్యాయ, చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు తెలిపారు.
 

click me!