గుజరాత్ కన్నా మెరుగ్గానే ఉన్నాం.. కానీ, తమిళనాడు, కేరళ బానే ఉన్నాయిగా

Published : May 14, 2018, 11:04 AM IST
గుజరాత్ కన్నా మెరుగ్గానే ఉన్నాం.. కానీ, తమిళనాడు, కేరళ బానే ఉన్నాయిగా

సారాంశం

అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు

పేదరికం లో ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కన్నా.. ఏపీ మెరుగ్గానే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ఉన్నాయని.. వాటి బాటలోనే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రాథమిక విద్యలో మూడో స్థానంలో ఉన్నామని, ఐఐటీలో 12% ఫలితాలు ఏపివేనని గుర్తుచేశారు. 

దేశంలోనే విద్యారంగంలో ఆంద్రప్రదేశ్‌ నంబర్‌వన్ కావాలన్నారు. పదేళ్ళలో దేశంలో పేదరికం 51%నుంచి 21%కు చేరిందన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలలో పేదరికం స్థాయి 9% వచ్చిందని.. కేరళలో పేదరికం 1%, తమిళనాడులో 6%, కర్ణాటకలో 11%, తెలంగాణలో 12%, ఆంధ్రప్రదేశ్‌లో 13% ఉందని తెలిపారు. ఈ విషయంలో గుజరాత్ 16%, పశ్చిమ బెంగాల్ 17% కంటే ఏపీ మెరుగ్గా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

అధికారులతో టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు.. పలు విషయాలపై చర్చించారు. పిడుగులతో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు జారీ చేశారు. పిడుగుల సమాచారం గ్రామాలకు, ప్రజలకు ముందే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుల సమాచారం ముందే ఇస్తున్నా ఇంకా మరణాలు సంభవిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందిన ఘటనలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు లేవు కాబట్టి ఉపాధి పనులు ముమ్మరం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యేలోపు నరేగా పనులు గరిష్టంగా చేపట్టాలన్నారు. ఈ నెలలోనే రూ.1,000కోట్లు విలువైన నరేగా పనులు చేయాలని సూచించారు. రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. 525గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతోందని.. ఈ గ్రామాల్లో తాగునీటి పథకాల పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. గిరిజన తండాల్లో రూ.105కోట్లతో 1,017పనులు వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 531 పనులు త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

మహానాడులో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Chandrababu Naidu Powerful speech | Mahanaadu 2026 Day-1
Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu