కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన చంద్రబాబు

First Published Jun 20, 2018, 11:18 AM IST
Highlights

డెల్టా కాలువలకు నీటి విడుదల


విజయవాడ:  కృష్ణా డెల్టా కాలువలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు  నీటిని విడుదల చేశారు. గత ఏడాది కంటే  వారం ముందుగానే కృష్ణా డెల్టా కాలువలకు  ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది.

కృష్ణా కాలువలో గంగమ్మ పూజలు నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. అంతకు ముందు కృష్ణా డెల్టా కాలువల ఆధునీకీకరణ పనుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు.కృష్ణాడెల్టాలోని 7.36 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీకి చుక్క నీరు రాకున్నా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంటే వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.

వైకుంఠపురం బ్యారేజీ పనులకు  త్వరలోనే టెండర్లను పిలువనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.  నదుల  అనుసంధానం చేయడం ద్వారా కరువును  పారదోలనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడ కూడ నీటి సమస్య లేకపోవడానికి ముందు చూపుతో వ్యవహరించడమే కారణమని ఆయన చెప్పారు. మంచి చెడులను ప్రజలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. 

రాయలసీమ రాళ్ళసీమగా మారుతోందని  ప్రజలు నిరాశ చెందారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ముందుజాగ్రత్త చర్యల వల్ల ఏప్రిల్ మాసంలో కూడ చెరువులు నీటితో కలకలలాడుతున్నాయని ఆయన చెప్పారు. 


గోదావరి పెన్నా నదులను అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు.  గొలుసు కట్టు చెరువులను నిర్మించి రాష్ట్రంలో భూగర్భజలాలను అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. పోలవరంప్రాజెక్టుకు అక్టోబర్ మాసంలో మొదటి గేటును అమర్చనున్నట్టు బాబు చెప్పారు.కృష్ణా డెల్టా ఆధునీకీకరణకు రూ. 3900 కోట్లు కేటాయించినట్టు బాబు చెప్పారు.  వంశాధార, నాగావళి నదులను కూడ అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు.

మురుగునీటిని కాలువలకు వదలకూడదని బాబు ప్రజలను కోరారు. నీటి పారుదల శాఖ  అద్భుతంగా పనిచేస్తోందని  ఆయన చెప్పారు. మంత్రి నుండి క్షేత్రస్థాయిలో పనిచేసే వరకు అద్బుతంగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పి కొట్టాలని  బాబు  కోరారు. రాష్ట్రంలో అభివృద్ది అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

 

click me!