చంద్రబాబు ఐడియా: రైతులకు ఆంగ్ల పాఠాలు

By sivanagaprasad kodatiFirst Published Dec 9, 2018, 12:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కొత్త తరహా ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, నూతన సాంకేతికత తదితర విషయాలు రైతులకు మరింత చేరువయ్యేలా వారికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ క్లాసులు పెట్టిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కొత్త తరహా ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, నూతన సాంకేతికత తదితర విషయాలు రైతులకు మరింత చేరువయ్యేలా వారికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ క్లాసులు పెట్టిస్తామని తెలిపారు.

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని, ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చన్నారు.

ఏపీ అనుసరిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. మొత్తం 10 రోజుల పాటు ఈ శిక్షణా తరగుతులు జరుగుతాయని చివరి రోజున పరీక్ష పెడతామని.. ప్రతి రోజు శిక్షణలో నేర్చుకున్న అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.

మొత్తం పది రోజులకు కలిపి 60 ప్రశ్నలు ఇస్తారని.. మీ స్మార్ట్‌ఫోన్‌లోనే అబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

దీనిలో భాగంగానే ఇంగ్లీష్‌ క్లాసులను కూడా ప్రవేశపెట్టామన్నారు. అతి త్వరలో అగ్రికల్చరల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని.. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు ముందుగా పేర్లు ఎన్‌రోల్ చేసుకుని శిక్షణలో పాల్గొనవచ్చని సీఎం వివరించారు.

అప్పట్లో తాను సీఎంగా ఉన్నప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. దాని వల్ల తాను నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టానని, హైటెక్ సిటీని నిర్మించి.. సైబరాబాద్‌ను నెలకొల్పినట్టు చంద్రబాబు చెప్పారు. నాడు చాలామందికి ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదని వారికి ఇంగ్లీష్ క్లాసులు సైతం పెట్టించానన్నారు. ఆ రోజు తాను తీసుకున్న చర్యల వల్లే ఈ రోజు అమెరికా సిలికాన్ వ్యాలీలో అత్యధిక ఆదాయం పొందుతున్న వారిలో తెలుగువారు మొదటిస్థానంలో నిలబడగలిగారన్నారు ముఖ్యమంత్రి. 
 

click me!