చంద్రబాబు దీక్షకు అనూహ్య స్పందన: జాతీయ స్థాయిలో 22పార్టీల మద్దతు

By Nagaraju penumalaFirst Published Feb 9, 2019, 3:47 PM IST
Highlights


జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమిని ఏర్పాటు చేస్తున్న తరుణంలో చంద్రబాబు ఈనెల 11న ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. అందుకు ఢిల్లీ వేదిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సత్తా ఏంటో హస్తినలో తెలపాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 11న ఢిల్లీలో ఆంధ్రభవన్ లో దీక్ష చేయనున్నారు. అందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

చంద్రబాబు నాయుడు చేపట్టబోయే దీక్షకు అనూహ్య రీతిలో జాతీయ స్థాయిలో పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక కూటమి పేరుతో జాతీయ స్థాయిలో పర్యటిస్తున్నారు. బీజేపీ యేతర కూటమిని కూడగడుతున్నారు. 

అంతేకాదు జాతీయ స్థాయిలో 22 పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈవీఎంల వినియోగం రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమానికి కూడగట్టారు. 22 పార్టీల ప్రతినిధులతో  కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమిని ఏర్పాటు చేస్తున్న తరుణంలో చంద్రబాబు ఈనెల 11న ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. అందుకు ఢిల్లీ వేదిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సత్తా ఏంటో హస్తినలో తెలపాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

హస్తినలో చేపట్టబోయే ధర్మపోరాట దీక్షకు హాజరు కావాలని ఇప్పటికే పలు పార్టీలకు చంద్రబాబు నాయడు ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ కాంగ్రెస్‌ అధినేత ఫరూక్‌అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే నేతల మద్దతు ప్రకటించారు. 

అటు కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ లు కూడా హాజరవుతామని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. జేడీఎస్ తరుపున మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేదా పార్టీ ప్రతినిధులు దీక్షకు సంఘీభావం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే ఈ నెల 11న ఢిల్లీలో ఉదయం 8గంటలకు చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షను ప్రారంభించి రాత్రి 8 గంటల వరకు కొనసాగించనున్నారు. దేశరాజధాని వేదికగా ఈనెల 11న నిర్వహించే ధర్మపోరాట దీక్షను విజయవంతం చెయ్యాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 

ప్రజలు, ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. ఇకపోతే ధర్మపోరాట దీక్షకు సంబంధించి ఖర్చు నిమిత్తం రాష్ట్ర ఆర్థిక శాఖ రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది. అంతేకాదు అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా జనాలను తరలించేందుకు కోటి రూపాయలు పైగా వెచ్చిస్తోంది. 
 

click me!