పోలవరంపై వైసీపీ, టీఆర్ఎస్ ల కుట్ర: చంద్రబాబు

By Nagaraju TFirst Published Dec 24, 2018, 6:27 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో సుపరిపాలనపై రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని జరగనివ్వనని హామీ ఇచ్చారు.  

అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో సుపరిపాలనపై రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని జరగనివ్వనని హామీ ఇచ్చారు.  

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువన కట్టుకుంటుంటే తాము పోలవరం ప్రాజెక్టును దిగువనే కడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయినా పోలవరం ప్రాజెక్టును టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని విమర్శించారు. టీఆర్ఎస్ అడ్డుకుంటుంటే ఆ పార్టీకి మద్దతు పలుకుతూ వైసీపీ ఏపీకి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. 

రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని చరిత్ర క్షమించబోదన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకే కేసీఆర్ ఓడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారంటూ ఆరోపించారు.  
పోలవరం వల్ల ఒడిస్సాకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. 

గతంలో పోలవరం ప్రాజెక్టుపై ఛత్తీష్ ఘర్ సీఎం రమణ్ సింగ్ తో తాను మాట్లాడానని అయితే అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారని అయితే ఆ తర్వాత అతనిలో మార్పు కనిపించిందన్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో అవసరమైతే ఒడిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్ తో మరోసారి మాట్లాడతానని తెలిపారు. తమ ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే జగన్ కు కనిపించడం లేదా అంటూ నిలదీశారు.  ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బాధ్యతారాహిత్యంగా రాష్ట్రానికి ద్రోహం చేస్తారా అంటూ మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టు భావితరాల భవిష్యత్ అని, ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అంటూ చెప్పుకొచ్చారు. పోలవరంపై తెలంగాణలో కేసీఆర్ మాట్లాడతారని, ఇక్కడ వైసీపీవాళ్లు ఆయనకు పాలాభిషేకం చేస్తారని చంద్రబాబు మండిపడ్డారు. 

రాజకీయం కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా? అంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి రాజకీయపార్టీలు ఏపీలో ఉండడం దురదృష్టమని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, రాజధాని నిర్మాణాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా జగన్‌ ఆరోపిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

సుపరిపాలనపై రెండో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

click me!