కేసీఆర్, మోడీ రివ్యూలు చేసుకుంటే తప్పు లేదు... నేను చేస్తే తప్పా: చంద్రబాబు

By Siva KodatiFirst Published Apr 22, 2019, 2:06 PM IST
Highlights

ప్రజావేదికలో సమావేశాలు పెడితే తప్పేంటని ప్రశ్నించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌ను సీఎం ప్రారంభించారు

ప్రజావేదికలో సమావేశాలు పెడితే తప్పేంటని ప్రశ్నించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌ను సీఎం ప్రారంభించారు. పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహారశైలి, వైసీపీ దాడులపై చంద్రబాబు.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులతో చర్చించారు.

అలాగే కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మేం సమావేశాలు పెడితే తప్పు.. మోడీ సమావేశాలు పెట్టుకుంటే తప్పు లేదా అని ప్రశ్నించారు.

అన్ని విధాలుగా మనల్ని అడ్డుకుంటున్నారని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నీటి సమస్యపై రివ్యూ చేయకూడదంటున్నారని నీటి సమస్యను వెంటనే తీర్చాలన్నారు.

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల అవసరాలు తీర్చాలని సీఎం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీకి 150కి మించి సీట్లు రావని.. తమిళనాడులో డీఎంకేకే పరిస్థితి అనుకూలంగా ఉందని చంద్రబాబు జోస్యం చెప్పారు.

బూత్‌ల వారీగా ఎన్నికలు జరిగిన సరళిపై సమీక్ష చేయాలని.. అలాగే పార్లమెంట్ వారీగా సమీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్ సమీక్షలు జరుపుతుంటే ఎవరూ అడగటం లేదని చంద్రబాబు మండిపడ్డారు.

మన కోసం క్యూలో నిలబడి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. రేపట్నుంచి నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా నేతలను ఆదేశించారు. మనం ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని.. తాగు, సాగు నీరు సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రేణులకు సూచించారు.

ఎవరైనా రెచ్చగొట్టేలే వ్యవహరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఎం తెలిపారు. సాధారణ పారిపాలన జరిగేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించాలని చంద్రబాబు కోరారు. 
 

click me!